
- ఇంత వరకు కొత్త సీఎం తో భేటీ కాని స్మిత
- కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు దరఖాస్తు
- కేసీఆర్ హయాంలో కీలక పదవుల నిర్వహణ
హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇవాళ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. 23 ఏండ్ల క్రితం తాను ఐఏఎస్ గా విదుల్లో చేరిన నాటి ఫొటోనూ షేర్ చేస్తూ.. ‘ కొత్త చాలెంజ్ కు ఎప్పుడైనా రెడీ’ అంటూ పోస్ట్ చేశారు. దీంతో స్మితా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ తరుణంలో ఆమె ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ హయాంలో సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన స్మితా సబర్వాల్.. నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శిగానూ బాధ్యతల్లోనూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులను కూడా పర్యవేక్షించారు. అయితే కొత్త సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఆమె కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని, అందుకే కొత్త సీఎం రేవంత్ వద్దకు వెళ్లడం లేదనే ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఆమె చాలెంజ్ కు ఎప్పుడైనా సిద్ధమంటూ చేసిన ట్వీట్ రకరకాల విశ్లేషణలకు తావిస్తోంది.