- సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ మరో ట్వీట్
- దీనిపై తనను విమర్శించేవాళ్లు మాట్లాడాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్ లో దివ్యాంగుల కోటాపై ఎక్స్‌లో వివాదాస్పద ట్వీట్ చేసిన సీనియర్ ఐఏఎస్అధికారి స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ మేరకు సోమవారం మరో ట్వీట్ చేశారు. ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌తోపాటు డిఫెన్స్ రంగంలో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు లేవు?.. అలాంటప్పుడు ఐఏఎస్‌కు మినహాయింపు ఎందుకు? అని ప్రశ్నించారు.
‘‘నేను చేసిన ట్వీట్ పై చాలా మంది అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎస్, ఐఎఫ్ఎస్, డిఫెన్స్ రంగాల్లో దివ్యాంగుల రిజర్వేషన్లు ఎందుకు లేవు? ఇందులో ఐఏఎస్ కు ఎందుకు మినహాయింపు ఇవ్వాలి? నన్ను విమర్శించే మానవ హక్కుల కార్యకర్తలు.. ఈ అంశంపై ఎందుకు ప్రశ్నించరు? అందరూ కలిసి ఉండే సమాజంలో మనం నివసిస్తున్నం..ఇతరుల ఫీలింగ్స్‌ను నేను అర్థం చేసుకోగలను’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ కామెంట్లపై కూడా దుమారం చెలరేగింది. సోషల్‌మీడియా వేదికగా ఆమెపై నెటిజన్లు మరోసారి ఫైర్ అయ్యారు.
