- కాంగ్రెస్ సభ్యులపై స్మృతి ఇరానీ ఆగ్రహం
న్యూఢిల్లీ : మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారన్న రాహుల్ గాంధీ కామెంట్లపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి కామెంట్ ఎవరూ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భరతమాతను హత్య చేశారని రాహుల్ కామెంట్ చేస్తే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ.. చప్పట్లు కొడ్తారా? దేశ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు. మణిపూర్‌ను ఎవరూ ముక్కలు చేయలేదు.
ఇప్పటికీ మణిపూర్ ఇండియాలో భాగమే”అని స్పష్టం చేశారు. మీరు ‘ఇండియా’ (ప్రతిపక్షాల కూటమిని ఉద్దేశించి) కాదని స్మృతి ఇరానీ విమర్శించారు. ఇండియాలో అవినీతి ఉండదన్నారు. ఇండియా మెరిట్‌ను మాత్రమే ప్రోత్సహిస్తుందని, వారసత్వాన్ని కాదని విమర్శించారు. భరతమాతను హత్య చేశారని చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాహుల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాను స్మృతి ఇరానీ కోరారు.
పండిట్ల హత్యల టైంలో ఎక్కడపోయారు?
కాశ్మీర్లో పండిట్ల హత్యలు జరుగుతుంటే కనిపించలేదా అని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ స్మృతి ఇరానీ ప్రశ్నించారు. అప్పుడు రాహుల్ ఎక్కడికి పోయారని మండిపడ్డారు. పండిట్లు, మహిళలపై జరిగిన దారుణాలను ఒక సినిమాలో చూపిస్తే.. కాంగ్రెస్ నేతలు దాన్నొక ప్రచారమని విమర్శించారని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
పాదయాత్రలో భాగంగా ఆ ఆర్టికల్‌ను మళ్లీ తెస్తామని రాహుల్ హామీ ఇచ్చారని, అందుకే పాదయాత్ర చేయగలిగారని అన్నారు. మణిపూర్‌లో శాంతి స్థాపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అల్లర్లపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించామన్నారు. దేశంలో అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. యూపీఏ హయాంలో మహిళలపై ఎన్నో అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయని, రాజస్థాన్‌లో బాలికపై గ్యాంగ్ రేప్ చేసి.. ముక్కలుగా నరికేశారని స్మృతి ఇరానీ గుర్తు చేశారు.