Smriti Mandhana: బాధ నుంచి త్వరగా బయటకి: పెళ్లి రద్దని ప్రకటించిన తర్వాత రోజే బ్యాట్ పట్టిన స్మృతి మంధాన

Smriti Mandhana: బాధ నుంచి త్వరగా బయటకి: పెళ్లి రద్దని ప్రకటించిన తర్వాత రోజే బ్యాట్ పట్టిన స్మృతి మంధాన

టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన పెళ్లి క్యాన్సిల్ తర్వాత తొలిసారి బ్యాట్ పట్టింది. పలాష్ ముచ్చల్ తో జరగాల్సిన వివాహం ఆగిపోవడంతో ఆ బాధ నుంచి త్వరగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. వివాహం రద్దు తర్వాత దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన ఏకైక లక్ష్యమని చెప్పిన మంధాన.. అంతర్జాతీయ క్రికెట్ కు సిద్ధమవుతోంది. బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. సోమవారం (డిసెంబర్ 8) ఇంస్టాగ్రామ్ లో బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో షేర్ చేసింది. మందాన త్వరగా పెళ్లి క్యాన్సిల్ నుంచి బయటపడి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండడంతో నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

స్వదేశంలో వరల్డ్ కప్ గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న భారత మహిళలు జట్టు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 2 తర్వాత భారీ విరామం తీసుకొని శ్రీలంకతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనున్నారు. బంగ్లాదేశ్ తో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్ రద్దు కావడంతో శ్రీలంకతో సిరీస్ కు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ లో బంగ్లాతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ తో పాటు.. మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే.. రెండు దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్ రద్దు చేయబడింది. ఈ ఏడాది ఆగస్టులోరాజకీయ కారణాల వలన బంగ్లాదేశ్ తో టీమిండియా మెన్స్ జట్టు వైట్ బాల్ సిరీస్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. 

డిసెంబర్ 21 నుంచి ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభమవుతోంది. తొలి రెండు టీ20 మ్యాచ్ లు వరుసగా 21,23 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతాయి. సిరీస్ లోని చివరి మూడు టీ20 మ్యాచ్ లు డిసెంబర్ 26, 28, 30 తేదీల్లో తిరువనంతపురం వేదిక కానుంది. వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత మహిళలు జట్టు 2026 టీ20 వరల్డ్ కప్ పై దృష్టి పెట్టనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి 2024 టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే భారత మహిళల జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. త్వరలోనే భారత జట్టు స్క్వాడ్ ను ప్రకటించనున్నారు.  

ప్రైవసీని గౌరవించండి:
 
చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్న మంధాన, పలాష్ మ్యారేజ్ నవంబర్ 23న జరగాల్సి ఉంది. సంగీత్ తదితర కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహిస్తుండగా.. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగా పెండ్లి వాయిదా పడింది. అప్పటి నుంచే ఈ పెండ్లి రద్దయిందని, మంధానను పలాష్ మోసం చేశాడని పుకార్లు మొదలయ్యాయి. అయితే, తాజాగా ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించడంతో ఈ వ్యవహారానికి పూర్తిగా తెరపడింది. పలాష్ ఇద్దరూ తమ బంధానికి ముగింపు పలికినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సమయంలో తమ  ప్రైవసీని గౌరవించాలని రిక్వెస్ట్ చేశారు.

‘నా మ్యారేజ్ రద్దయిందని స్పష్టం చేస్తున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని కోరుతున్నా. నేను సాధారణంగా నా వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచుతాను. కానీ గత కొన్ని వారాలుగా నాపై వస్తున్న ప్రచారాల వల్ల స్పందించక తప్పడం లేదు. దయచేసి రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించండి’ అని స్మృతి ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.  ప్రస్తుతం తన దృష్టంతా క్రికెట్‌‌‌‌‌‌‌‌పైనే ఉందని, ఇండియా కోసం ట్రోఫీలు గెలవడమే తన లక్ష్యమని  స్పష్టం చేసింది.