భారత్ మహిళల జట్టులో గట్టి పోటీ.. ఎవరికీ చోటు ఇవ్వాలో అర్థం కావడం లేదన్న స్మృతి మందానా

భారత్ మహిళల జట్టులో గట్టి పోటీ.. ఎవరికీ చోటు ఇవ్వాలో అర్థం కావడం లేదన్న స్మృతి మందానా

Smriti Mandhana: ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన ఈ పోరులో టీమిండియా 26 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందుబాటులో లేకపోవడంతో.. స్టాండ్-ఇన్ కెప్టెన్ స్మృతి మంధాన జట్టును ముందుండి నడిపించింది. కార్డిఫ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్‌తో ఆపై బౌలింగ్‌తో అదరగొట్టింది. 

మంధాన మెరుపులు.. భారతి హాఫ్ సెంచరీ: 
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ కిరాక్ ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ మంధాన కేవలం 23 బంతుల్లోనే 39 రన్స్ చేయగా, అయితే మిడిల్ ఓవర్లలో భారత్ కాస్త తడబడినప్పటికీ, తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న బ్యాటర్ భారతి ఫుల్మాలి సంచలన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 40 బంతుల్లోనే 56 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో వెస్టిండీస్ ముందు 180 రన్స్ ఉంచింది. 

బౌలింగ్‌లో శ్రేయాంక, రాధా యాదవ్ జోరు: 
181 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను భారత బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. ముఖ్యంగా యువ బౌలర్లు విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచారు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శ్రేయాంక పాటిల్ శాసించింది. ఇక మిడిల్ ఓవర్లలో అత్యంత కీలకమైన స్పెల్ వేసి విండీస్ రన్ రేట్‌ను కట్టడి చేయడమే కాకుండా కీలక వికెట్లని రాధా యాదవ్ తీసుకుంది. ఈ వీరిద్దరూ కలిసి మొత్తం 7 వికెట్లు పడగొట్టడంతో వెస్టిండీస్ జట్టు 150 పరుగులకే పరిమితమైంది.

►ALSO READ | రుతురాజ్ క్లాస్ సెంచరీ.. తిలక్ వర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్.. శ్రీలంక ముందు భారత్-A ఫైటింగ్ స్కోర్!

ఇప్పుడు మాకు తలనొప్పి: స్మృతి మంధాన
మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన జట్టు ప్రదర్శనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. బెంచ్ ప్లేయర్స్ ఫామ్‌లోకి రావడం వరల్డ్ కప్‌కు ముందు జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అని పేర్కొంది. ఇంగ్లాండ్‌కు వచ్చిన తర్వాత రాధా, శ్రేయాంక, భారతిలకు ఆడేందుకు ఎక్కువ సమయం దొరకలేదు.. కానీ, వచ్చిన అవకాశాన్ని ముగ్గురూ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. వరల్డ్ కప్ తుది జట్టు ఎంపికకు ముందు ఇలాంటి ప్రదర్శనలు చేయడం కెప్టెన్‌గా, మేనేజ్‌మెంట్‌కు 'తీపి తలనొప్పి' (Good Headache) లాంటిది.. 15 మంది ఆటగాళ్లూ ఫామ్‌లో ఉండటం జట్టులో పోటీని పెంచుతుందని మంధాన వెల్లడించింది.  

ఇంగ్లాండ్ తో కీలక పోరు: 
ఈ విజయంతో మంచి జోష్‌లో ఉన్న భారత్.. బుధవారం హోస్ట్ టీమ్ అయిన ఇంగ్లాండ్‌తో తన తదుపరి హై-ప్రొఫైల్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు వెస్టిండీస్ జట్టు టోర్నీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాతో తన చివరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లలో ప్రదర్శనల ఆధారంగా వరల్డ్ కప్ ఆడే భారత తుది XI (Playing XI) పై ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.