స్మృతి మంధాన పెండ్లి రద్దు.. పలాష్‌‌‌‌‌‌‌‌తో బంధానికి గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్

స్మృతి మంధాన పెండ్లి రద్దు.. పలాష్‌‌‌‌‌‌‌‌తో బంధానికి గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్

న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ క్రికెట్ స్టార్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌‌‌‌‌‌‌‌తో జరగాల్సిన తన పెండ్లి రద్దయినట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించింది. స్మృతి, పలాష్ ఇద్దరూ తమ బంధానికి ముగింపు పలికినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సమయంలో తమ  ప్రైవసీని గౌరవించాలని రిక్వెస్ట్ చేశారు.

‘నా మ్యారేజ్ రద్దయిందని స్పష్టం చేస్తున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని కోరుతున్నా. నేను సాధారణంగా నా వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచుతాను. కానీ గత కొన్ని వారాలుగా నాపై వస్తున్న ప్రచారాల వల్ల స్పందించక తప్పడం లేదు. దయచేసి రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించండి’ అని స్మృతి ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.  ప్రస్తుతం తన దృష్టంతా క్రికెట్‌‌‌‌‌‌‌‌పైనే ఉందని, ఇండియా కోసం ట్రోఫీలు గెలవడమే తన లక్ష్యమని  స్పష్టం చేసింది.

మరోవైపు తన విషయంలో వస్తున్న పుకార్లపై పలాష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కూడా జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ‘మా ఇద్దరి బంధం గురించి నిరాధారమైన పుకార్లు రావడం చాలా బాధాకరం. తప్పుడు వార్తలు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌‌‌‌‌‌‌‌ను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని పలాష్ హెచ్చరించాడు. 

చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్న మంధాన, పలాష్ మ్యారేజ్ గత నెల 23న జరగాల్సి ఉంది. సంగీత్ తదితర కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహిస్తుండగా.. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగా పెండ్లి వాయిదా పడింది. అప్పటి నుంచే ఈ పెండ్లి రద్దయిందని, మంధానను పలాష్ మోసం చేశాడని పుకార్లు మొదలయ్యాయి. అయితే, తాజాగా ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించడంతో ఈ వ్యవహారానికి పూర్తిగా తెరపడింది.