కర్ణాటక నుంచి ఏపీకి లిక్కర్ అక్రమ రవాణా

కర్ణాటక నుంచి ఏపీకి లిక్కర్ అక్రమ రవాణా

గద్వాల, వెలుగు: రాష్ట్రం బార్డర్​లో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాలో కర్నాటక లిక్కర్​దందా జోరుగా సాగుతోంది. జిల్లాను ఆనుకుని కర్నాటక బార్డర్​దాదాపు 60 కిలోమీటర్లు ఉంది. ఆ రాష్ట్రంలో చీప్ లిక్కర్ రేట్లు తెలంగాణ, ఆంధ్రాకంటే 50 శాతం తక్కువగా ఉండడంతో అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 15 చోట్ల ఎక్సైజ్ ఆఫీసర్లు దాడులు చేసి 2,720 లీటర్ల కర్నాటక లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. 18కి పైగా టు, ఫోర్​వీలర్స్​సీజ్ చేశారు. 25 మందిపై కేసులు నమోదు చేశారు. కర్నాటక రాష్ట్రం నుంచి లిక్కర్ ను తెలంగాణ వరకు రోడ్డు మార్గంలో, ఇక్కడి నుంచి ఆంధ్రాకు తుంగభద్ర నదీ మార్గంలో అర్ధరాత్రి వేళ పోలీసులు, ఎక్సైజ్ ల కళ్లు కప్పి తరలిస్తున్నారు. ప్రధానంగా బలిగేరా, నందిన్నె, చింతలకుంట, ఇరికిచేడు, ముసల్ దొడ్డి, బాగుంట, జూరాల డ్యాం తదితర ప్రాంతాల నుంచి లిక్కర్ తెలంగాణలోకి వస్తోందని ఎక్సైజ్ ఆఫీసర్లు గుర్తించారు. దాదాపు 50కి పైగా రూట్ వాచ్​లు నిర్వహించి రూ. 16 లక్షలకు పైగా విలువైన చీప్​లిక్కర్​స్వాధీనం చేసుకున్నారు. ప్రతిరోజు ఏదో ఒకచోట లిక్కర్ సరఫరా జరుగుతుండడంతో తనిఖీలు చేయడం ఎక్సైజ్ ఆఫీసర్లకు కత్తి మీద సాముగా మారింది. దాదాపు 60 కిలోమీటర్ల మేర బార్డర్ విస్తరించి ఉండటంతో ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి లిక్కర్ తీసుకువస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

కర్నాటకలో సగం రేటే..

తెలంగాణ, ఏపీతో పోలిస్తే కర్నాటకలోని చీప్ లిక్కర్ రేట్లు సగానికి పైగా తక్కువగా ఉన్నాయి. 90 ఎంఎల్ చీప్​లిక్కర్​కర్నాటకలో రూ. 35 ఉండగా తెలంగాణ, ఏపీలో రూ. 70 పైగా ఉంది. సగానికి పైగా రేటు తక్కువగా ఉండడంతో వాటిని తీసుకువచ్చి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.  ప్రస్తుతం దాడుల్లో ఎక్కువగా చీప్ లిక్కర్ కార్టన్​లే ఎక్కువగా దొరుకుతున్నాయి. ఇటీవల ఏపీలో లిక్కర్ రేట్లు తగ్గించడంతో తెలంగాణ మీదుగా, తెలంగాణ బార్డర్ వైన్స్​నుంచి ఆంధ్రాకు లిక్కర్ సరఫరా సగానికి పైగా తగ్గింది. ఆంధ్ర, తెలంగాణ రేట్లతో పోలిస్తే ఇప్పటికీ చీప్ లిక్కర్ రేట్లు కర్నాటకలో తక్కువగా ఉండటం మాఫియాకు కలిసివస్తోంది. 

కఠిన చర్యలు లేకపోవడంతో..

కర్నాటక నుంచి తెలంగాణ, ఆంధ్రాకు లిక్కర్ ను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు కొరవడడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. అధికార పార్టీకి చెందిన కొందరు లీడర్లు అక్రమంగా లిక్కర్ సరఫరా చేస్తూ లక్షలు గడిస్తున్నారు. వారికి పోలీసులు, ఎక్సైజ్ ఆఫీసర్లు సపోర్ట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నకిలీ లిక్కర్ తయారు చేసిన కేసులో కర్నాటకకు చెందిన స్పిరిట్ శ్రీనును ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంతో ఎక్సైజ్ ఆఫీసర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల క్రితం గోవా  లిక్కర్ పట్టుబడినా అది ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను ఎక్సైజ్ ఆఫీసర్లు తేల్చలేకపోయారు. అదేవిధంగా ధరూర్ మండలం పాతపాలెంకు చెందిన ఓ టీఆర్ఎస్ లీడర్ వరుసగా అక్రమ లిక్కర్, సీహెచ్ సరఫరా చేస్తూ పట్టుబడగా.. స్టేషన్ బెయిల్ ఇవ్వడం పలు విమర్శలకు తావిచ్చింది. తహసీల్దార్​ముందు టీఆర్ఎస్ లీడర్ ను బైండోవర్ చేశారు. ఏడాదిలోపు ఎలాంటి క్రైమ్ చేయకూడదని రూల్​ఉన్నప్పటికీ మళ్లీ జడ్చర్ల దగ్గర సీహెచ్ కేసులో ఆ లీడర్​పట్టుబడ్డాడు. అయినప్పటికీ ఆయనపై పీడీ కేసు కాకుండా సాధారణ కేసు పెట్టారు. 

గట్టి నిఘా పెడుతున్నాం 

కర్నాటక నుంచి అక్రమంగా లిక్కర్ సరఫరా కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశాం. బార్డర్ ఎక్కువ కిలోమీటర్లు ఉండటం వల్ల కొంత ఇబ్బందులు వస్తున్నాయి. అక్రమ లిక్కర్ మాఫియా పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాం.
- గోపాల్, ఎక్సైజ్ సీఐ, గద్వాల