వడ్లు  చేతికొచ్చి 2 నెలలైతున్నా కొన్నది 32 శాతమే

వడ్లు  చేతికొచ్చి 2 నెలలైతున్నా కొన్నది 32 శాతమే
  • కుప్పల దగ్గర్నే రైతుల పడిగాపులు
  • కొనుగోలు టార్గెట్​ కోటీ 3 లక్షల టన్నులు
  • అందులో కొన్నది 31.94 లక్షల టన్నులే
  • తాజాగా 18 శాతానికిపైగా టార్గెట్​ను 
  • తగ్గించుకున్న సర్కారు
  • పేరుకే  సెంటర్లు.. చాలా చోట్ల సాగని కొనుగోళ్లు

హైదరాబాద్‌, వెలుగు: వానాకాలం వరి పంట చేతికొచ్చి రెండు నెలలు దాటినా.. ఇప్పటివరకు రాష్ట్ర సర్కారు 32 శాతానికి మించి వడ్లను కొనలేదు. ఎక్కడికక్కడ కల్లాల్లో, రోడ్ల పొంట, కొనుగోలు సెంటర్లలో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయి. ఎండకు ఎండి, వానకు తడిసి ఖరాబైతున్నాయి. వడ్లను  కాపాడుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. కుటుంబాలతో కలిసి కుప్పల దగ్గర్నే కావలి కాస్తున్నారు. సెంటర్లకు తెచ్చి రోజులు, నెలలు గడుస్తున్నా కొంటలేరని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లలో ఆలస్యం వల్ల కొందరు రైతులు వ్యాపారులకు అగ్గువకు అమ్మేసుకుంటున్నారు. మొదట పెట్టుకున్న కోటీ 3 లక్షల టన్నుల కొనుగోలు టార్గెట్​లో ప్రభుత్వం ఇప్పటివరకు  31.94 లక్షల టన్నుల వడ్లను మాత్రమే కొన్నది. చాలా ప్రాంతాల్లో సెంటర్లు తెరిచినా.. వడ్లు కాంటా పెడ్తలేరు. కొన్ని సెంటర్లలో కాంటాలు పెట్టినా.. లోడ్​ చేస్తలేరు. ఇంకొన్ని సెంటర్లలో లోడ్​చేసినా.. మిల్లర్లు దించుకుంటలేరు. 
టార్గెట్​ను 18 శాతానికిపైగా తగ్గించి..!
సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఈ వానాకాలం కోటీ మూడు లక్షల టన్నుల వడ్లు కొనాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంది. ఆ తర్వాత వడ్ల కొనుగోళ్లపై పంచాయితీ నడుస్తోందని తాజాగా టార్గెట్‌‌‌‌‌‌‌‌ను తగ్గించుకున్నది. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్న టార్గెట్‌‌‌‌‌‌‌‌లో 18.96 లక్షల టన్నులు తగ్గించి.. 84.14 లక్షల టన్నులు కొనాలని నిర్ణయించుకుంది. ఇన్నాళ్లూ  వానాకాలం కొనుగోళ్లకు సమస్య లేదంటూ చెప్పుకొచ్చిన రాష్ట్ర  సర్కారు.. కొనుగోళ్ల టార్గెట్​ను 18 శాతానికిపైగా తగ్గించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు తెరవక... ప్రైవేటు వ్యాపారులకు రైతులు అమ్ముకునే పరిస్థితి తీసుకువచ్చిందనే విమర్శలు ఉన్నాయి. బార్డర్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లోని రైతులు తమ దగ్గర సెంటర్లు లేక ఇతర రాష్ట్రాలకు వడ్లు తీసుకొని పోయి అమ్ముకుంటున్నారు. 
పేరుకే సెంటర్లు తెరిచిన్రు
రాష్ట్రంలో సెప్టెంబర్​ నుంచి వరికోతలు మొదలయ్యాయి. వడ్లు కొంటామని అక్టోబర్​లో సర్కారు ప్రకటన చేసింది. సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌ శాఖ మొదట పెట్టుకున్న టార్గెట్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటి వరకు 32 శాతం మించి కొనుగోళ్లు చేపట్టలేదు. ఫస్ట్​ పెట్టుకున్న టార్గెట్​ 1.03 కోట్ల టన్నులు కాగా..  అందులో శనివారం నాటికి కొన్నది 31.94 లక్షల టన్నులు మాత్రమే. నిరుడు కంటే ఈసారి దాదాపు నెల రోజుల ముందే పంట చేతికొచ్చింది. 6,877 కొనుగోలు సెంటర్లు తెరుస్తామని చెప్పి  విడతలవారీగా 6,631 సెంటర్లను ఓపెన్​ చేశారు. ఇందులో 4,754 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 249 సెంటర్లు ఓపెన్​ చేసినా.. 21 సెంటర్లలోనే వడ్లు కొంటున్నరు. కొత్తగూడెం జిల్లాలో 166 సెంటర్లకు గాను 2 సెంటర్లలో,  వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 161 సెంటర్లకుగాను 40 సెంటర్లలో, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 202 సెంటర్లకుగాను 19 సెంటర్లలో, మంచిర్యాల జిల్లాలో 230 సెంటర్లకుగాను  53 సెంటర్లలో, వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 127 సెంటర్లకు గాను 42 సెంటర్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. 
ఏడు జిల్లాల్లో నామ్కేవాస్తే
ఏడు జిల్లాల్లోనైతే నామ్కేవాస్తేగా వడ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 175 టన్నులు, గద్వాల జిల్లాలో 265 టన్నులు, భూపాలపల్లి జిల్లాలో 622 టన్నులు, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 678 టన్నులు మాత్రమే కొన్నారు. ఇక.. నిజామాబాద్​ జిల్లాలో 6.30 లక్షల టన్నులు, కామారెడ్డి జిల్లాలో 3.98 లక్షల టన్నులు, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 2.83 లక్షల టన్నులు , మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 2.58లక్షల టన్నులు, సిద్దిపేట జిల్లాలో 2.10 లక్షల టన్నులు, నల్గొండ జిల్లాలో 1.92 లక్షల టన్నులు, జగిత్యాల జిల్లాలో 1.81 లక్షల టన్నులు, సిరిసిల్ల జిల్లాలో 1.65 లక్షల టన్నులు , పెద్దపల్లి జిల్లాలో 1.49 లక్షల టన్నులు, సంగారెడ్డి జిల్లాలో 1.10 లక్షల టన్నులు, సూర్యాపేట జిల్లాలో 1.08 లక్షల టన్నులు, యాదాద్రి జిల్లాలో 1.08 లక్షల టన్నులు కొన్నారు.  
కొనుగోలు సెంటర్లలో అన్నీ సమస్యలే
వడ్ల కొనుగోలు సెంటర్లలో రైతులను సమస్యలు వేధిస్తున్నాయి. లారీలు రాక , సెంటర్లలో ధాన్యం కాంటా  పెట్టక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వడ్లను కాంటా పెట్టినా..  లారీలు రావట్లేదు. ఇంకొన్ని చోట్ల లారీల్లో లోడ్లు వెళ్లినా మిల్లర్లు దించుకుంటలేరు. తమ దగ్గర వడ్లు కొనడం లేదంటూ పలు చోట్ల రైతులు రాస్తారోకోలకు దిగుతున్నారు. వానకు తడిసి వడ్లు మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మూడుసార్లు వడ్లు తడిసినయ్​
వడ్లు సెంటర్లకు వచ్చిన నెల రోజులకు గోనె సంచులు ఇస్తున్నరు. నవంబరు 18న వడ్లను సెంటర్ కు తెచ్చినం. డిసెంబర్​ 18కు బస్తాలు ఇస్తమని డేట్‌  రాసుకున్నరు.  రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులు ఆగమైతున్నరు. ఎప్పటికప్పుడు వడ్లను కొనాలి.  కొనుగోలు సెంటర్​లో వడ్లు పోస్తే  ఇప్పటికే మూడు సార్లు వానకు తడిసినయ్‌. కుప్పల మీద కప్పేందుకు పర్దలు కిరాయికి తెచ్చుకుంటే రోజుకు ఒక్కదానికి రూ. 20 అయితున్నది.  లారీల్లో లోడ్​కు కూడా పైసలు అడుగుతున్నరు. మిల్లులు ఫుల్‌ అయితే మా పైసలతోటే లారీలు మాట్లాడుకుని వేరే జిల్లాలకు తీస్కపొమ్మంటున్నరు.  
- రావుల గోవిందరెడ్డి, రైతు, వెల్దండ గ్రామం, జనగామ జిల్లా

సెంటర్లను నమ్ముకునేటట్లు లేదు
సెంటర్లను నమ్ముకుంటే నట్టేట మునిగే పరిస్థితి ఉంది. మా దగ్గర ఇప్పుడిప్పుడే సెంటర్లు తెరుస్తున్నరు. ఐదెకరాల పొలం కోసినం. ఎకరానికి 18 క్వింటాళ్ల చొప్పున 90 క్వింటాళ్ల దాకా వడ్లు వచ్చినయ్‌‌‌‌‌‌‌‌. సెంటర్​లో ఎప్పుడు కొంటరో తెలుస్తలేదు. దీంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
                                                                         - కె. బీరయ్య,  రైతు, ఆలేడు, నెల్లికుదురు     మండలం, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా
వడ్లకు కావలి కాస్తున్నం
మూడెకరాల వరిపొలం కోసినం. మా దగ్గర ఇప్పటికీ కొనుగోలు సెంటర్​ను ఏర్పాటు చేయలేదు. ఊర్లె వంద మంది రైతులం వడ్లు  ఎండపోసుకుని కావలి కాస్తున్నం. పొద్దంతా ఎండ బోసి, రాత్రి కుప్పల మీద పట్టాలు కప్పుకోవాల్సి వస్తున్నది. నిరుడు యాసంగిల నెలకు పైగా కొనుగోలు సెంటర్​లో వడ్లు పోస్తే కాంట పెట్టక 15 సంచుల వడ్లల్లో మొలకలు వచ్చి ఖరాబైనయ్​.
                                                                                                                                       - నారాయణరెడ్డి, రైతు,  ఖమ్మం జిల్లా