దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఐదేళ్లలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశమే ఆశ్చర్యపడేలా..రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన TRS సభ్యత్వ నమోదు విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ లో గతంలో ఎండాకాలం వస్తే జలమండలి కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు జరిగేవని…ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా తాగునీటి సమస్యకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపించారన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ నేతలు చేస్తున్నఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. తెలంగాణ రైతుల పొలాలు పచ్చగా కన్పిస్తుంటే వారి కళ్లు ఎర్రబడుతున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలు విచక్షణ లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని..ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదన్నారు.
అంతేకాదు 24 గంటలు కరెంట్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కారు చీకట్లను సీఎం కేసీఆర్ తొలగించారన్నారు. 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని… ఏటా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.
గతంలో గణేష్ పండుగ వస్తే హైదరాబాద్ లో కర్ఫ్యూ విధించేవాళ్లని.. ఇప్పుడు కర్ఫ్యూలు లేకుండా శాంతి భద్రతలను అద్భుతంగా పోలీసులు నిర్వహిస్తున్నారని ఆ శాఖపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయన్న కేటీఆర్.. పేదలకు త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు.
