మా డిమాండ్లకు ఒప్పుకోకపోతే..5 కోట్ల మంది ముంబైకి వస్తరు

మా డిమాండ్లకు ఒప్పుకోకపోతే..5 కోట్ల మంది ముంబైకి వస్తరు
  • ఫడ్నవీస్​కు జరాంగే  వార్నింగ్​
  • మరాఠా కోటాపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ 
  • నాలుగో రోజుకు నిరాహార దీక్ష
  • ముంబైలో ట్రాఫిక్ జాం చిక్కులు

ముంబై: మరాఠా కోటాపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సామాజిక కార్యకర్త మనోజ్  జరాంగే హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ తాను ముంబైని వీడేది లేదన్నారు. తన మాట వినకపోతే తన దీక్షకు మద్దతుగా 5 కోట్ల మంది మరాఠాలు ముంబైకి వస్తారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు ఆయన వార్నింగ్  ఇచ్చారు. మరాఠాలకు 10% కోటా కోసం ఆజాద్  మైదాన్​లో జరాంగే ప్రారంభించిన నిరాహార దీక్ష సోమవారం నాలుగో రోజుకు చేరింది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటా అంశాన్ని ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ‘‘ప్రభుత్వం తలచుకుంటే కోటాపై నిర్ణయాన్ని ఇప్పటికిప్పుడే తీసుకోవచ్చు. నా మాట వినకపోతే ముంబైకి వచ్చేందుకు మరాఠాలు ఎదురుచూస్తున్నారు” అని జరాంగే వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి జరాంగే మంచినీళ్లు కూడా మానేశారు. దీంతో జేజే హాస్పిటల్ డాక్టర్ల బృందం జరాంగేకు వైద్య పరీక్షలు చేసింది. కాగా, జరాంగే దీక్షతో ముంబైలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్  స్తంభించింది. 

దీంతో, దీక్ష పేరుతో ట్రాఫిక్ కు ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ జరాంగే, అతని మద్దతుదారులపై హైకోర్టు మండిపడింది. ఆజాద్  మైదానంలో 5 వేలకు మించి నిరసనకారులు ఉండొద్దని, మిగిలిన వాళ్లు వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది.