సోషల్​ మీడియా వేదికలు ఇకపై మరింత జవాబుదారీతనం

సోషల్​ మీడియా వేదికలు ఇకపై మరింత జవాబుదారీతనం

న్యూఢిల్లీ : సోషల్  మీడియా వేదికలను ఇక మరింత జవాబుదారీతనంగా చేస్తామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్  తెలిపారు. ఫేక్ న్యూస్, డీప్  ఫేక్ ల వీడియోలను కట్టడి చేయడానికి కొత్త చట్టాలు తెస్తామని, అందుకోసం రూల్స్​లో మార్పులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.  శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. ఇటీవలి కాలంలో డీప్​ ఫేక్ ల వీడియోల సమస్య ఎక్కువైందని, ముఖ్యంగా సెలబ్రిటీల వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్  చేస్తున్నారని పేర్కొన్నారు.

అలాగే ఫేక్  న్యూస్  బెడద కూడా ఎక్కువైందన్నారు. ఈ నేపథ్యంలో సోషల్  మీడియాలో అలాంటి కంటెంట్  లేకుండా చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. డీప్  ఫేక్, ఫేక్  న్యూస్ ను సోషల్  మీడియా ప్లాట్ ఫాంలు వెంటనే గుర్తించి, తగిన చర్యలు తీసుకునేలా రూల్స్ ను ఫ్రేమ్  చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే చాలా సోషల్  మీడియా ప్లాట్ ఫాంలు ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నాయని తెలిపారు.

ఎరువుల సబ్సిడీకి రూ.1.71 లక్షల కోట్లు..

ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు ఎరువుల సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.1.71 లక్షల కోట్లు అందజేసినట్లు ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన లోక్‌‌సభలో లిఖితపూర్వక సమాధానం చెప్పారు. రైతులకు తక్కువ ధరకే సరిపడా ఎరువులు లభ్యమయ్యేలా ప్రభుత్వం వివిధ ఎరువులపై సబ్సిడీని అందజేస్తోందని ఆయన తెలిపారు. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో (జనవరి 31, 2024 నాటికి) దేశంలో ఎరువుల కోసం రూ.1,70,923 కోట్లు సబ్సిడీ ఇచ్చినట్టు చెప్పారు.

ఫాస్ఫేటిక్, పొటాసిక్ (పీఅండ్​కే) ఎరువుల కోసం ప్రభుత్వం ఏప్రిల్ 1, 2010 నుంచి పోషకాహార ఆధారిత సబ్సిడీ (ఎన్​బీఎస్​) విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ విధానంలో మార్కెట్ డైనమిక్స్ ప్రకారం ఎరువుల కంపెనీల ద్వారా గరిష్ట రిటైల్ ధర నిర్ణయించబడుతుందని, దీని ప్రకారం ఈ ఎరువులను కొనుగోలు చేసే పేద, సన్నకారు రైతులతో సహా దేశంలోని ప్రతి రైతు సబ్సిడీ పొందుతారని ఖుబా వెల్లడించారు.