నాకు బ్రేకప్ అయ్యింది.. లీవ్ కావాలి సర్.. ఢిల్లీలో మహిళా ఉద్యోగి మెయిల్తో సీఈఓ షాక్.. ఏం చేశాడంటే

 నాకు బ్రేకప్ అయ్యింది.. లీవ్ కావాలి సర్.. ఢిల్లీలో మహిళా ఉద్యోగి మెయిల్తో సీఈఓ షాక్.. ఏం చేశాడంటే

ఈ రోజుల్లో లవ్ లో పడటం.. బ్రేకప్ అవ్వటం.. క్వైట్ కామన్. లవ్ ఫెయిల్ అయితే అబ్బాయిలు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటుంటారు కానీ.. అమ్మాయిలు ఎక్కువ శాతం తమలోనే దాచుకుని కుమిలి పోతుంటారు. అయితే బ్రేక్ అయిన ముచ్చట ఆఫీస్ సీఈఓ కు చెప్పి లీవ్ అడగటం దాదాపు ఎక్కడా ఉండదు. ఎలాంటి మొహమాటం లేకుండా లీవ్ కావాలి సర్ అని ఏకంగా సీఈఓకే మెయిల్ చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఢిల్లీ-గుర్గాన్ లో ఓ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి చేసిన మెయిల్ గురించి సీఈఓ జస్వీర్ సింగ్ ఎక్స్ లో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు తను చూసిన అప్లికేషన్లలో ఇదే అత్యంత నిజాయితీ కలిగిన లీవ్ లెటర్ గా ఆయన కొనియాడారు. 

జనరేషన్ జెడ్ ( జెన్-Z ) ఏ విషయాన్ని దాచరు. అంటే ఈ జనరేషన్ యూత్ ఏ విషయాన్నైనా ఓపెన్ గా మాట్లాడతారు. వాళ్ల ఆలోచనలు, మానసిక స్థితి గురించి సంకోచం లేకుండా షేర్ చేసుకుంటారు.. అంటూ జస్వీర్ చెప్పుకొచ్చాడు. 

పని చేయడానికి ఇబ్బందిగా ఉంది..

తన ఆఫీసులో ఒక ఎంప్లాయ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. బ్రేకప్ కారణంగా వర్క్ పై ఫోకస్ చేయలేక పోతున్నా.. రికవర్ అయ్యేందుకు కొన్ని రోజులు కావాలి.. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు లీవ్ కావాలి.. అంటూ ఎంప్లాయ్ మెయిల్ పంపిందని జస్వీర్ సింగ్ పోస్ట్ చేశాడు. ఆమె మానసికంగా కోలుకునేందుకు లీవ్ ఇచ్చినట్లు చెప్పాడు. అదే విధంగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమని.. పూర్తిగా రికవర్ అయ్యాకే ఆఫీస్ కు రమ్మని ధైర్యం చెప్పినట్లు పోస్ట్ చేశాడు. 

►ALSO READ | FASTag యూజర్లకు హెచ్చరిక.. KYC పూర్తి చేయకుంటే ఆటోమ్యాటిక్ డీయాక్టివేషన్..

సీఈఓ పై నెటిజన్ల ప్రశంసలు:

నిర్మొహమాటంగా బ్రేకప్ నుంచి కోలుకునేందుకు లీవ్ అడిగిన ఎంప్లాయ్ ని నెటిజన్లు అభినందిస్తున్నారు. అదే విధంగా బాస్ సపోర్ట్ ను కూడా కొనియాడతున్నారు. ఆఫీస్ కల్చర్ చేంజ్ అవుతోంది. మానసిక సమస్యలు, ఎమోషన్స్ ను కూడా అర్థం చేసుకునే బాస్ లు ఉండటం లక్కీ.. అంటూ రిప్లై ఇస్తున్నారు. 

పెళ్లికి కూడా ఇన్ని రోజులు తీసుకోరేమో అంటూ మరొకరు కామెడీ చేయబోయారు. బ్రేకప్ నుంచి బయట పడేందుకు పెళ్లి కంటే ఎక్కువ సెలవులు కావాలి అని నేను నమ్ముతా.. అంటూ రిప్లై ఇచ్చాడు.