సామాజిక శాస్త్రాలూ అవసరమే : ఐ. ప్రసాదరావు, సోషల్​ ఎనలిస్ట్

సామాజిక శాస్త్రాలూ అవసరమే : ఐ. ప్రసాదరావు, సోషల్​ ఎనలిస్ట్

ప్రపంచం ఈరోజు ఇలా ఉండటానికి కారణం అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలు. ఒక సమాజం లేదా దేశం ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి సాధించాలంటే సామాజిక శాస్త్రాల పాత్ర కీలకం. చరిత్ర, పౌర శాస్త్రం, రాజనీతి, ఆర్థిక, తత్వ, కళా, న్యాయ శాస్త్రాలు తప్పకుండా అధ్యయనం చేయాలి. చరిత్ర తెలుసుకోవడం ద్వారానే భవిష్యత్తును రూపుదిద్దుకోగలం. గతంలో జరిగిన మంచి, చెడు సంఘటనలు తెలుసుకోవడం ద్వారా వర్తమాన, భవిష్యత్తును తీర్చుదిద్దుకోగలరు.

మానవ పరిణామ క్రమం, ప్రపంచ యుద్ధాలు, అనేక అనారోగ్య మహమ్మారులు, పాలకుల విధానాలు, రాజకీయ, ఆర్థిక విధానాలు, వ్యాపారాలు, మార్కెట్లు, మత విశ్వాసాలు నమ్మకాలు, కొత్త ఆవిష్కరణలు, నిర్మాణాలు వంటివి తెలుసుకోవడం ద్వారానే ముందుకు వెళ్లగలం. ప్రతీ ఒక్కరూ తమ బాధ్యత, హక్కులు దిశా నిర్దేశం చేసుకుంటూ, ప్రస్తుతం ఉన్న అసమానతలు, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తూ ముందుకు సాగుతూ, మరింత ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మించుకుని సమానత్వంతో శాంతియుతంగా జీవించాలి.

అయితే ఇటీవల కాలంలో చాలా మంది తల్లిదండ్రులు సామాజిక శాస్త్రాలు చదవడానికి తమ పిల్లలకు అవకాశం ఇవ్వడం లేదు.‌ త్వరితగతిన చదువు పూర్తి చేసుకుని, లక్షల డబ్బులు ప్యాకేజీలు చేతికి వచ్చే చదువులకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, ప్రస్తుతం సమాజంలో అనేక అసమానతలకు కారణం అవుతుంది. ‘చదువు అంటే కేవలం డబ్బు సంపాదించడమే’ అనే ధోరణి పెరుగుతున్నది. డబ్బు సంపాదించడం, ఆస్తులు కూడబెట్టడమే లక్ష్యంగా సమాజం ముందుకు సాగుతున్నది. సామాజిక శాస్త్రాల్లో కనీస అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. 

సమాజం తెలియాలంటే..

ఒక దేశాధినేత సరిగా పాలించడం లేదంటే మనం సింపుల్ గా హిట్లర్ తో పోలుస్తాం. హిట్లర్ చరిత్ర అలా మారడానికి కారణం,  ప్రపంచ యుద్ధాలకు కారణాలు, ఫలితాలు వంటివి పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే చరిత్ర చదవాలి. ఈఫిల్ టవర్, తాజ్ మహల్ వంటివి నిర్మాణాలు, ప్రపంచ భౌగోళిక స్వరూపాలు, వివిధ దేశాల స్వాతంత్ర్య సమరాలు,  వాతావరణాలు, భాషలు, మతాలు, ఖగోళ విజ్ఞానం, పరిపాలన, మానవ హక్కులు, బాధ్యతలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, విధులు, విదేశాంగ విధానాలు, ఉగ్రవాదం, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగాలు మానవ సంబంధాలు వంటివి తెలుసుకోవాలంటే సామాజిక శాస్త్రాలు అధ్యయనం చేయాల్సిందే. లేకపోతే భవిష్యత్తులో మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, అబ్రహాం లింకన్, అంబేద్కర్ వంటి వారు ఎవరు అని అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. 

మనిషి సంఘజీవి

ప్రపంచాన్ని కుదిపివేసిన జాతి వివక్ష నేటికీ మనదేశంలో కొనసాగుతున్న కుల, మత, లింగ వివక్ష గురించి పూర్తి విషయాలు అవగాహన కోసం సామాజిక శాస్త్రాలు చదవాలి.‌ మన దేశ స్వాతంత్ర్య సమర పోరాటం, మనదేశంలో, రాష్ట్రాల్లో ప్రస్తుత పరిపాలన, ప్రభుత్వ విధానాలు, అధిక ధరలు, నిరుద్యోగం, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, ప్రజా పోరాటాలు, విశ్లేషణ చేయాలన్నా హ్యుమానిటీఎస్​ఎంతో అవసరం. ‌‌- ఐ. ప్రసాదరావు, సోషల్​ ఎనలిస్ట్