
సొసైటీలకు సొసైటీలే
హోల్‌సేల్‌గా ఏకగ్రీవాలు
అన్ని జిల్లాల్లో అధికార పార్టీ నేతల ప్రలోభాలు
సహకార ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించడంతో ఎన్నికలకు ముందే విపక్ష, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కాడె వదిలేశారు. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికలే అయినప్పటికీ పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులపై కన్నేసిన టీఆర్ఎస్ లీడర్లు తమ మద్దతుదారుల కోసం ఇతరులను నయానా భయానా బరిలోంచి తప్పించారు. కొన్ని చోట్ల డబ్బుల ఆశచూపారు. తమకు బలం లేని స్థానాల్లో ఆయా పార్టీల నేతలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకొని వైస్‌చైర్మన్ పదవులు ఎరవేశారు. మొత్తం మీద ఎన్నికలకు ముందే మెజారిటీ సొసైటీలను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా అన్ని జిల్లాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను దక్కించుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ప్రలోభాలు.. పంపకాలు..
ఖానాపూర్ మండలం సత్తెనపల్లి పీఏసీఎస్ లో 12కుగాను 11 ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికైన డైరెక్టర్లను టీఆర్ఎస్ క్యాంపునకు తరలించింది. వీరిలో కొందరు కాంగ్రెస్ మద్దతుదారులున్నా వారిని కూడా ప్రలోభపెట్టి క్యాంపునకు తరలించారనే ప్రచారం జరుగుతోంది.
మంచిర్యాల జిల్లాలో ఇటిక్యాల, గుళ్లకోట, జైపూర్, భీమారం, గూడెం, వేమనపల్లి సొసైటీల్లో మొత్తం 13కు 13 డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యారు. పోనకల్ లో తొమ్మిది, కోటపల్లిలో 12, చెన్నూరులో 12, నెన్నెలలో 12 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీరిలో మెజారిటీ టీఆర్ఎస్కు చెందినవారే. పోటీలోఉన్న వారిని తప్పించేందుకు ఒక్కో చోట రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆఫర్ ఇచ్చినట్టు చెప్తున్నారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరు సొసైటీలో 13 స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. కట్కూరు సొసైటీకి సొంత భవనం లేదు. ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా ఆ డబ్బుతో సొసైటీ ఆఫీసు కోసం భూమి కొనాలని నిర్ణయించుకున్న గ్రామస్థులు ముందస్తు ఒప్పందం ప్రకారం ఒక్కో నామినేషన్ వేశారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బిడేకన్నె సొసైటీలో 12 డైరెక్టర్ పోస్టులూ ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికైన వారిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాండిడేట్లు ఉన్నారు.కాంగ్రెస్‌కు చైర్మన్, టీఆర్ఎస్కు వైస్ చైర్మన్ పదవులు దక్కేలా ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. డైరక్టర్లంతా సోమవారం క్యాంపునకు వెళ్లారు.
జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం కళ్లెంలో మొత్తం 13మంది డైరెక్టర్లు ఏకగ్రీవం అయ్యారు. ముందే కుదిరిన ఒప్పందం మేరకు టీఆర్ఎస్ తొమ్మిది, కాంగ్రెస్ నాలుగు డైరెక్టర్ పోస్టులను పంచుకున్నాయి.
యాదాద్రి జిల్లాలోని 21 సహకార సొసైటీలుండగా 79 మంది డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యారు. వీరిలో 70 మంది టీఆర్ఎస్ వారుకాగా, ఒకరు బీజేపీ, 8 మంది కాంగ్రెస్ వారున్నారు. రేణికుంట, వంగపల్లి, పోచంపల్లి, జూలూరు, తుర్కపల్లి సొసైటీలు టీఆర్ఎస్కు దక్కాయి. తుర్కపల్లి సొసైటీలో కాంగ్రెస్‌కు 4 డైరెక్టర్లతో పాటు వైస్ చైర్మన్ పదవిని ఇచ్చేలా అగ్రిమెంట్ కుదిరినట్లు తెలుస్తోంది. ఖర్చుల కోసం రూ. 3 లక్షలు కూడా టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ క్యాండిడేట్లకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
నల్గొండ జిల్లాలో పదవులను టీఆర్ఎస్, కాంగ్రెస్ పంచుకున్నాయనే ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వెనిగండ్లలో ఏడు డైరెక్టర్ పోస్టులను టీఆర్ఎస్, ఆరింటిని కాంగ్రెస్ పంచుకున్నాయి. ఇక్కడ చైర్మన్ పదవి టీఆర్ఎస్కు దక్కనుంది.
కామారెడ్డి జిల్లాలో 55 సొసైటీలు ఉండగా ఇందులో12 సోసైటీలు ఏకగ్రీవమయ్యాయి. బాన్సువాడ మండలం దేశాయిపేట సొసైటీ చైర్మన్ పదవిపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొడుకు భాస్కర్‌రెడ్డి కన్నేశారు. ఇక్కడ13 టీసీలు ఏకగ్రీవమయ్యాయి. ఈయన డీసీసీబీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. పిట్లం మండలం తిమ్మానగర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పరం ఏకగ్రీవం చేసుకున్నారు. చైర్మన్ పదవి టీఆర్ఎస్కు వైస్‌చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ములుగు జిల్లాలోని వాజేడు పీఎసీఎస్‌లో టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 3, బీజేపీ, సీపీఐ, సీపీఎం క్యాండిడేట్లు ఒకటి చొప్పున డైరెక్లర్ స్థానాలను పంచుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్కు చైర్మన్, కాంగ్రెస్‌కు వైస్‌చైర్మన్ పోస్టు దక్కాయి.
ములుగు జిల్లా పాలంపేటలో గ్రామాభివృద్ధి కోసం రూ.10 లక్షలు ఖర్చుచేయాలని టీసీలంతా తీర్మానించారు. డబ్బు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన అభ్యర్థులు తప్ప మిగిలినవారంతా నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు.
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పీఏసీఎస్ చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్న ఇద్దరు క్యాండిడేట్లు ఒకే టీసీ నుంచి పోటీచేస్తున్నారు. ఓ అభ్యర్థి తన ప్రత్యర్థిని బరిలో నుంచి తప్పించడానికి ఏకంగా రూ.5 లక్షలు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇంత చేసినా ఆ టీసీ స్థానం ఏకగ్రీవం కాలేదు.
రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి, నర్సింగాపూర్ సొసైటీ లు ఏకగ్రీవమయ్యాయి.డైరెక్టర్లను క్యాంపులకు తరలించారు.
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పడాల కనుకయ్య. ఊరు పెద్దపల్లి జిల్లా రొంపికుంట గ్రామం. కమాన్‌పూర్ సొసైటీ 13 వార్డు నుంచి పోటీ చేస్తున్న కనుకయ్య బీజేపీలో యాక్టివ్‌గా పని చేస్తున్నారు. ఎన్నికల్లో కనుకయ్య గెలుపు ఖాయమని భావించిన స్థానిక టీఆర్ఎస్ నేతలు కొందరు ముందుగా ఆయనను పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారు. వినకపోవడంతో డబ్బులు ఆశ చూపారు. అయినా వినకపోవడంతో చివరకు బెదిరించి బలవంతంగా నామినేషన్ విత్‌డ్రా చేయించారు. దీంతో అవమానం భరించలేక కనుకయ్య సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయనను కుటుంబసభ్యులు పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తనను టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని పలుమార్లు 100కు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని కనుకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
– వెలుగు, పెద్దపల్లి
పెద్దసంఖ్యలో విత్డ్రాలు..
రాష్ట్రంలో 909 పీఏసీఎస్(ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ)లు ఉండగా, 905 పీఏసీఎస్‌లకు ఈ నెల 15న ఎన్నికలు జరుగుతాయి. ప్రతి పీఏసీఎస్ నుంచి 13 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వీరంతా తమలో ఒకరిని చైర్మన్‌గా, ఒకరిని వైస్‌చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన పీఏసీఎస్ చైర్మన్లు తమలోంచి డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్చైర్మన్లను ఎన్నుకుంటారు. పీఏసీఎస్‌లలో డైరెక్టర్ స్థానాలకు ఈ నెల 6 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు.9న స్క్రూటినీ పూర్తికాగా, 10న ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో అన్ని జిల్లాల్లో పెద్దసంఖ్యలో క్యాండిడేట్లు విత్డ్రాచేసుకున్నారు. ఈ క్రమంలో 13 డైరెక్టర్ స్థానాలకు 13 యునానమస్ కావడంతో సొసైటీలకు సొసైటీలే ఏకగ్రీవమయ్యాయి. ఆయాచోట్ల టీఆర్ఎస్ మద్దతుదారులు చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడం లాంఛనమే.