రూ.10 కోట్లు వసూలు చేసి.. బోర్డు తిప్పేసిన మాదాపూర్ ఐటీ కంపెనీ ప్రైడే అప్

రూ.10 కోట్లు వసూలు చేసి.. బోర్డు తిప్పేసిన మాదాపూర్ ఐటీ కంపెనీ ప్రైడే అప్

ఐటీ కంపెనీ.. ఆర్భాటం తక్కువేం కాదు.. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోని అయ్యప్ప సొసైటీలో పెద్ద బిల్డింగ్ లో ఆఫీసు.. మూడు అంతస్తుల్లో.. 300 మంది ట్రైనింగ్ అంటూ భారీ ఎత్తున ప్రచారం.. ట్రైనింగ్ ఇస్తాం.. ఆ తర్వాత ఉద్యోగం కూడా మేమే ఇప్పిస్తాం.. ఇంతా చేసినందుకు మాకు మాత్రం ఖర్చులు ఉండవా అంటూ భారీ ఎత్తున పబ్లిసిటీ.. ఇంకేముందీ.. 600 మంది నిరుద్యోగులు తరలివచ్చారు.. ఒక్కొక్కరు.. కోర్సులకు తగ్గట్టు 50 వేల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు కట్టారు.. అదేంట్రా ఉద్యోగం లేకుండానే డబ్బులు కట్టించుకుంటున్నారు అని.. ఎవరైనా ఫ్రెండ్స్ అంటే.. అంత పెద్ద బిల్డింగ్స్.. కోచింగ్.. ట్రైనింగ్ ఇస్తున్నారు కదా.. వాళ్లకు మాత్రం ఖర్చులు ఉండవా అంటూ నిరుద్యోగులే.. ఎవరికి వారు సమర్ధించుకుంటూ.. లక్షలకు లక్షల రూపాయలు కంపెనీకి ధారపోశారు.. అవును.. ఇలా వసూలు చేసిన 10 కోట్ల రూపాయలతో రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసి వెళ్లిపోయాడు ఓనర్.. ఈ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్ మాదాపూర్ లోని  అయ్యప్ప సోసైటి 100 ఫీట్ రోడ్ లో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో కంపెనీ నిర్వహించిన కేటుగాళ్లు..  దాదాపు 600 మందికి పై బడిన నిరుద్యోగుల నుంచి 50 వేల నుంచి లక్షన్నర వరకు  వసూలు చేశారు.  ట్రైనింగ్ తర్వాత ప్లేస్ మెంట్ ఇప్పిస్తానంటూ  నమ్మించారు కంపెనీ ప్రతినిధులు. బాధితుల నుంచి సుమారు రూ.10 కోట్లు వసూలు చేశారు  కేటుగాళ్లు.. ఉన్నపళంగా కార్యాలయానికి తాళం వేయడంతో మోసపోయామని గ్రహించారు బాధితులు.

 మాదాపూర్ పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు బాధితులు. బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ వెనుక ప్రముఖ రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు.  ఈ కంపెనీ బెంగళూరు, విజయవాడ కేంద్రాలుగా ఉన్నాయని చెప్పారు.  కేసు నమోదు చేసిన మాదాపూర్  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.