వెనకా ముందు వెంటాడిన మృత్యువు... రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మృతి

వెనకా ముందు వెంటాడిన మృత్యువు... రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మృతి
  • మొయినాబాద్​లో ఘటన

చేవెళ్ల, వెలుగు: కారులో వెళ్తున్న సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్​ను రెండు వాహనాల రూపంలో మృత్యువు వెంటాడింది. ముందుగా వెనుక నుంచి ఓ వాహనం  ఢీకొట్టడంతో కారు మరో రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అదే రోడ్డుపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారులో ఉన్న సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్​ స్పాట్​లోనే మృతిచెందాడు. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా  మొయినాబాద్ పరిధిలో హైదరాబాద్–- బీజాపూర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్సింగి ప్రాంతానికి చెందిన సిద్ధార్థ(27) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. 

మంగళవారం మొయినాబాద్​లో క్రికెట్​ ఆడేందుకు నార్సింగి నుంచి కారులో బయల్దేరాడు. చిలుకూరు మృగవని జాతీయ పార్కు వద్దకు రాగానే వెనుక నుంచి ఓ ఫార్చునర్ కారు నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సిద్ధార్థ నడుపుతున్న కారు కుడి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో మొయినాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఆ కారును ఢీకొట్టింది. లారీ కిందకు కారు దూసుకెళ్లగా సిద్ధార్థ స్పాట్​లో చనిపోయాడు. ఈ ఘటనతో ఆ రోడ్డుపై దాదాపు గంటసేపు ట్రాఫిక్​ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మొయినాబాద్​ సీఐ పవన్​ కుమార్​రెడ్డి తెలిపారు. 

వాటర్​ ట్యాంకర్​ ఢీకొని స్టూడెంట్​..

జీడిమెట్ల : వాటర్​ ట్యాంకర్​ ఢీకొని బీటెక్​ స్టూడెంట్​ మృతిచెందిన ఘటన బాచుపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. మూసాపేట్, ఆంజనేయనగర్​కు చెందిన దేవరగుట్ట నిఖిల్(19) వి.ఎన్.ఆర్.విజ్ఞాన్​ జ్యోతి కాలేజీలో బీటెక్​ థర్డ్​ ఇయర్​ చదువుతున్నాడు. గురువారం కాలేజీ నుంచి ఇంటికి బైక్​పై బయల్దేరాడు. ఎలీఫ్​ చౌరస్తా వద్దకు రాగానే ప్రసాద్​ హాస్పిటల్​కు చెందిన వాటర్​ ట్యాంకర్​ ఢీకొట్డంతో కిందపడ్డాడు. ట్యాంకర్​ అతడి తలపై నుంచి వెళ్లడంతో స్పాట్​లో మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

క్రేన్ ఢీకొని వృద్ధుడు..

అల్వాల్: అల్వాల్ మచ్చ బొల్లారానికి చెందిన గుర్రం రామచంద్రన్(70) మంగళవారం ఉదయం అల్వాల్  కొంపల్లి ఐస్ ఫ్యాక్టరీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎదురుగా వచ్చిన క్రేన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

కారు ఢీకొని మహిళ..

శామీర్ పేట: శామీర్​పేట ఔటర్ రింగ్ రోడ్ పై 59వ కిలోమీటర్ వద్ద నర్ల అంతమ్మ(66) గార్డెనింగ్ పనులు చేస్తుంది. ఈ క్రమంలో శామీర్​పేట నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఆమె మృతిచెందారు. కారు నడుపుతున్న వ్యక్తిని హెచ్​డీఆర్సీ సంస్థలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న అరవింద్ కుమార్ గా గుర్తించారు.