
- ట్యాంకర్ ఒక్కసారిగా టర్న్ తీసుకోవడంతో ఘటన
మాదాపూర్, వెలుగు: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాటర్ ట్యాంకర్ కిందికి బైక్దూసుకెళ్లి, ఓ సాఫ్ట్వేర్ఉద్యోగి మృతిచెందాడు. ఎస్సై బలరాం నాయక్ వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పరకాల మండలం పులిగిల్లకు చెందిన దీపక్(29) హైదరాబాద్ శివారు మల్లంపేట కేవీఆర్ వ్యాలీ లో సోదరి ఇంట్లో ఉంటూ హైటెక్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు పని ఉందని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దీపక్ బైక్పై అల్విన్ కాలనీ డివిజన్లోని తులసీ నగర్లో ఉంటున్న సోదరుడు మణికంఠ ఇంటికి వెళ్లాడు.
అర్ధరాత్రి 11 గంటలకు తిరిగి మాదాపూర్ వైపు వచ్చాడు. 2 గంటల సమయంలో మాదాపూర్ పర్వత్ నగర్ సిగ్నల్ నుంచి అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డు మీదుగా హైటెక్ సిటీ వైపు వెళ్తున్నాడు. అదే సమయం హైటెక్ సిటీ నుంచి వస్తున్న వాటర్ ట్యాంకర్ బిర్యానీ టైమ్స్ చౌరస్తా వద్ద స్విమ్మింగ్ పూల్ రోడ్డు వైపు ఒక్కసారిగా టర్న్తీసుకుంది. దీంతో బైక్ స్పీడ్కంట్రోల్కాక ట్యాంకర్ కిందికి దూసుకెళ్లింది.
ట్యాంకర్వెనక టైర్లు దీపక్ పైనుంచి వెళ్లడంతో తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతను స్పాట్ లోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బావ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.