సాఫ్ట్ వేర్ ఉద్యోగం వ‌దిలి..ఆవుల‌ను కొని..రూ.44 కోట్ల ఆదాయం

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వ‌దిలి..ఆవుల‌ను కొని..రూ.44 కోట్ల ఆదాయం

బెంగళూరు:  ఐఐటీలో చదివి.. ప్రతిష్టాత్మక ఇంటెల్‌ కంపెనీలో కొలువు చేస్తున్న ఓ ఇంజనీర్‌ దాన్ని వదిలేసుకుని.. తనకు ఎంతో ఇష్టమైన పని చేయడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం అతడు సంతృప్తిగా బతకడమే కాక మరో 100 మందికి పైగా ఉపాధి చూపుతున్నాడు. ఉద్యోగం వదిలి 20 ఆవులను కొన్నాడు. వాటితో ఇప్పుడు ఏడాదికి 44 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు. కర్ణాటకకు చెందిన కిశోర్‌ ఇందుకూరి అనే వ్యక్తి ఐఐటీ ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మాస్టర్స్‌, పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇంటెల్‌ కంపెనీలో ఆరేళ్లు పని చేశాడు. ఉద్యోగంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికి అతడికి సంతృప్తి లేదు. దీంతో ఇండియాకు తిరిగి వచ్చాడు. అప్పుడే అతడి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. 


ఓ సారి పని నిమిత్తం కిశోర్‌ హైదరాబాద్‌ వచ్చాడు. ఆ సమయంలో అతడు నగరవాసులు స్వచ్ఛమైన పాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నాడు. ఆ సమయంలో కిశోర్‌కి వచ్చిన ఓ ఆలోచన అతడి జీవితాన్ని ట‌ర్న్ అయ్యేలా చేసింది. కిశోర్‌ జాబ్‌ వదిలేసి 20 ఆవులు కొని సొంత డెయిరీ ప్రారంభించాడు. కుటుంబ సభ్యులతో కలిసి స్వచ్ఛమైన పాలను వినియోగదారుల గుమ్మం వద్దకే తీసుకెళ్లసాగాడు. ఇక పాలు ఎక్కువ సమయం నిల్వ ఉండేలా చల్లబర్చి, నిల్వ చేసే విధానాన్ని ఉపయోగించాడు కిశోర్‌. 

2018 నాటికి డెయిరీ విస్తరించింది. దానికి తన కుమారుడు సిద్దార్థ్ పేరు మీద సిద్‌ ఫార్మ్ అని పేరు పెట్టాడు కిశోర్‌. ప్రస్తుతం అతడు 6 వేల మందికి పాలు పోస్తున్నాడు. షాబాద్ లో విస్తరించిన ఇతడి ఫామ్ లో ప్రస్తుతం 120 మంది పని చేస్తున్నారు. కిశోర్‌ కేవలం పాలు మాత్రమే కాక సేంద్రీయ పాల ఉత్పత్తులైన పెరుగు, నెయ్యిని విక్రయిస్తాడు. సిద్‌ ఫామ్ ఇప్పుడు రోజుకు దాదాపు 10,000 మంది వినియోగదారులకు తన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ డెయిరీ మీద అతడు సంవత్సరానికి 44 కోట్లు ఆర్జిస్తున్నాడు.