
అర్ధరాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లిన వ్యక్తి శవమై తేలిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మన్మోహన్యాదవ్వివరాల ప్రకారం.. మౌలాలి రైల్వేస్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడని స్థానికుల నుంచి బుధవారం మల్కాజిగిరి పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా మద్యం మత్తులో గొడవ జరిగి హత్యకు గురయ్యాడని గుర్తించారు. దొరికిన ఐడీ కార్డు ఆధారంగా తార్నాక విజయపురి కాలనీలో ఉండే జాషువా రోహిత్ షామియల్అలియాస్ బిట్టు(28)గా గుర్తించారు. అయితే బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మృతుని తల్లి నజ్రీన లేచి చూడగా కొడుకు కనిపించలేదు. బయటకు వెళ్లాడు అనుకుంది. అదే సమయంలో మల్కాజిగిరి పోలీసులు విషయం తెలపగా సంఘటన స్థలానికి చేరుకుని విగతజీవిగా పడిఉన్న కొడుకును చూసి బోరున విలపించింది. తన కొడుకు హైటెక్ సిటీలోని గూగుల్ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిపింది. పోలీసులు బిట్టు ఫోన్‌కాల్ లిస్ట్ చూడగా బుధవారం వేకువజామున 3:30 గంటల ప్రాంతంలో ఫ్రెండ్స్కాల్ చేయడంతోనే బయటకు వచ్చాడని గుర్తించారు. సంఘనా స్థలంలో మందు సీసాలు గుర్తించారు. సుమారు ముగ్గురు స్నేహితులతో కలిసి మందు తాగినట్లు పోలీసులు తెలిపారు. మాటా మాట పెరిగి చంపారా లేక ప్లాన్ ప్రకారమే హతమార్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.