
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి..
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం.. నెలకు రూ.60 వేల జీతం. వారానికి ఐదు రోజులే పని. ఇంకేం!! ఇవి చాలనుకుంటాం కదా. కానీ ఆమె అలా అనుకోలేదు. ప్రజాసేవ చేయాలని భర్త అడుగు జాడల్లో నడిచింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకొచ్చింది. తొలి ప్రయత్నంలోనే జడ్పీటీసీగా గెలిచిన ఆమెను జడ్పీ చైర్‌పర్సన్ పదవి వరించింది. ఆమే జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జక్కు శ్రీ హర్షిణి. పాతికేళ్ల వయసులోనే ఆమె పెద్ద బాధ్యత చేపట్టారు. జక్కు శ్రీ హర్షిణి తండ్రి రాజనర్సు సింగరేణి ఎంప్లాయ్. శ్రీ హర్షిణి టెన్త్ వరకు గోదావరిఖని, ఇంటర్, బీటెక్ హైదరాబాద్‌లో చదివారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ బెంగుళూర్ క్యాంపస్‌లో ఉద్యోగం వచ్చింది. కాటారం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు జక్కు రాకేశ్‌ను పెళ్లి చేసుకున్నారు. కాటారం జడ్పీటీసీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో రాకేశ్ తన భార్యను నిలబెట్టారు. ఆమె 390 ఓట్ల మెజారిటీతో గెలిచారు. భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలుండగా టీఆర్‌ఎస్ 6, కాంగ్రెస్ 4, ఏఐఎఫ్‌బీ ఒక్క జడ్పీటీసీ గెలిచాయి. ఇక్కడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. దీంతో శ్రీహర్షిణికి జడ్పీ చైర్‌పర్సన్ అయ్యే అవకాశం వచ్చింది.