
- అక్రమంగా తవ్వుతున్నా పట్టించుకోని అధికారులు
- అడ్డుకునేవారిపై దాడులు చేయిస్తున్న మట్టి మాఫియా
మేడిపల్లి, వెలుగు: అసెన్డ్ ల్యాండ్ లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేస్తుండగా అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారినే అడ్డుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. బోడుప్పల్ లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో రాత్రిపూట అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. పెద్ద కంచెగా పిలిచే ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 63/2 నుంచి 25 వరకు.. సుమారు 300 ఎకరాలు ఉండగా.. 1957లో అప్పటి ప్రభుత్వం 61 దళిత కుటుంబాలకు అసెన్డ్ చేసింది.
గత బీఆర్ఎస్ సర్కార్ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి లే అవుట్ చేసింది. కొంతమేరకు లబ్ధిదారులకు కేటాయించగా మిగిలినది అమ్మేందుకు నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన కొందరు రైతులు కోర్టుకు వెళ్లడంతో స్టే విధించగా.. లే అవుట్ పనులు ఆగిపోయాయి. దీంతో ఆ భూమిపై మట్టి మాఫియా కన్నుపడింది. కొంతమంది రైతులతో చేతులు కలిపి అక్రమంగా రాత్రికి రాత్రే మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన వారిపై గంజాయి బ్యాచ్ తో దాడి చేయించడం, బెదిరింపులకు పాల్పడుతున్నారు.
మట్టి తవ్వకాల ద్వారా లక్షల్లో వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులకు తెలిసినా అడ్డుకునేందుకు సాహసించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక రెవెన్యూ అధికారుల అండతోనే మట్టి మాఫియా తవ్వకాలు చేస్తున్నట్టు తెలిసింది.
వ్యవసాయం చేసుకునే రైతుల తమ భూముల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. సమీపంలోని రసాయన పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య వ్యర్థాలను పారబోస్తుండగా పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బోడుప్పల్ లోని ప్రభుత్వ భూమిలో (పెద్దకంచె) అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే ఆపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత శనివారం మేడిపల్లి తహసీల్దారుకు రైతులు నత్తి మైసయ్య, రాపోలు శ్రీరాములు, మైసగల జానీ కుమార్, చిలుక స్వామి, మైసగల్ల బాలయ్య, నరసింహ ఫిర్యాదు చేశారు.