ఔటర్ వెంట సోలార్ గ్రిడ్.. హైదరాబాద్‌‌ చుట్టూ 160 కి.మీ. మేర సోలార్ పవర్ ఉత్పత్తి

ఔటర్ వెంట సోలార్ గ్రిడ్.. హైదరాబాద్‌‌ చుట్టూ 160 కి.మీ. మేర సోలార్ పవర్ ఉత్పత్తి
  • ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
  • వచ్చే పదేండ్ల డిమాండ్‌‌కు తగ్గట్టు కరెంట్ ఉత్పత్తికి కార్యాచరణ
  • గ్రేటర్‌‌‌‌లో ఫుట్‌‌పాత్‌‌లు, నాలాలపైనా సోలార్ ప్యానల్స్
  • ఫ్యూచర్ సిటీలో అండర్‌‌‌‌గ్రౌండ్ విద్యుత్ లైన్లు
  • విద్యుత్ సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్​ దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వెంట (160 కిలోమీటర్ల మేర) సోలార్ పవర్​ఉత్పత్తికి ప్రణాళికలు రెడీ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌లు, నాలాల వెంట సైతం సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వచ్చే పదేండ్లలో రాష్ట్రంలో కరెంట్​డిమాండ్ 31,808 మెగావాట్లకు చేరుతుందని, అందుకు అనుగుణంగా విద్యుత్ ​ఉత్పత్తికి ప్రణాళికలు రెడీ చేయాలని ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్​శాఖపై సీఎం రేవంత్​రెడ్డి రివ్యూ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంట్ డిమాండ్ పెరుగుతున్నదని చెప్పారు. ‘‘గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ ​డిమాండ్ పెరుగుతున్నది. ఇందుకు తగ్గట్టుగా భవిష్యత్​ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, రాబోయే రోజుల్లో జరగనున్న పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలి. ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌తో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, మెట్రో, ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ లాంటి మాస్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టేషన్‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి తీసుకొని రెన్యువబుల్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రధానంగా సోలార్ విద్యుత్​ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి’’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో వచ్చే మూడేండ్లలో విద్యుత్ డిమాండ్ పీక్‌‌‌‌కు చేరుతుందని.. అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి  ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘‘గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కరెంట్​డిమాండ్​అత్యధికంగా 17,162 మెగావాట్లకు  చేరింది. పోయినేడాదితో పోలిస్తే ఇది 9.8 శాతం ఎక్కువ.

ఇక విద్యుత్ డిమాండ్ 2025–26లో 18,138 మెగావాట్లకు, 2034–35 నాటికి 31,808 మెగావాట్లకు చేరుకుంటుంది” అని సీఎంకు అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే  అందుకు తగ్గట్టుగా విద్యుత్తు ఉత్పత్తి పెంచుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై దృష్టిసారించాలని.. ఇందులో భాగంగా సోలార్, ఫ్లోటింగ్, పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు పెంచాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో అనుభవమున్న ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలని సూచించారు. 

అభివృద్ధి ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకోండి.. 
రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇరిగేషన్​ప్రాజెక్టులు, మెట్రో, రైల్వే లైన్ల విస్తరణ, ఇతర మాస్ ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్ల విద్యుత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి సూచించారు. ‘‘రాష్ట్రంలో పట్టణీకరణ పెరుగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం తెస్తున్న పెట్టుబడులతో కొత్త ఇండస్ట్రియల్ కారిడార్లు రాబోతున్నాయి. వీటికి తోడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు,  డేటా సెంటర్ల హబ్‌‌‌‌గా హైదరాబాద్​మారబోతున్నది.

హైదరాబాద్‌‌‌‌లో డేటా సిటీని ఏర్పాటు చేయనున్నాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, అందుకు తగ్గట్టుగా విద్యుత్​ఉత్పత్తిని పెంచుకోవాలి’’ అని దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా హైదరాబాద్‌‌‌‌లో ఔటర్​రింగ్​రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్‌‌‌‌షిప్‌‌‌‌లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్‌‌‌‌కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్‌‌‌‌గ్రేడ్ చేయాలని, విద్యుత్ లైన్ల ఆధునీకరణపైనా దృష్టిసారించాలని అన్నారు. సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ట్రాన్స్‌‌‌‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, టీజీ రెడ్కో ఎండీ అనిల్​ పాల్గొన్నారు.

హైదరాబాద్‌‌లో స్మార్ట్‌‌ పోల్స్..
హైదరాబాద్‌‌లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌‌ రెడ్డి సూచించారు. వీటిని ముందుగా సెక్రటేరియెట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘ఫ్యూచర్ సిటీలో పూర్తిగా అండర్‌‌‌‌గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. అక్కడ విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు కనిపించకూడదు. ఇప్పటికే ఉన్న హైటెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. అందుకు తగిన రూట్‌‌మ్యాప్​సిద్ధం చేయండి” అని అధికారులను సీఎం ఆదేశించారు.