సోలార్​ పవర్​ ఎటుపాయె? 

సోలార్​ పవర్​ ఎటుపాయె? 
  • ఆర్టీసీలో నత్తనడకన ప్లాంట్ల పనులు
  • ఏడాది కావొస్తున్నా ఇంకా నిర్మాణ దశలోనే
  • గ్రేటర్​లోని రెండు, మూడు డిపోల్లోనే ఉత్పత్తి
  • సోలార్​ పవర్​ యూనిట్​కు సగటు ధర రూ.5 .50
  • పూర్తిగా అందుబాటులోకి వస్తే ఏటా రూ.2.2 కోట్లు ఆదా

హైదరాబాద్‌‌, వెలుగు : నష్టాలు, అప్పుల్లో మునిగిపోయిన ఆర్టీసీని కాపాడుకునేందుకు వీలైనంత వరకూ ఖర్చులు తగ్గించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా మారాయి. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి.. కరెంట్ బిల్లును భారీగా ఆదా చేయాలని అధికారులు భావించినా ఆచరణలో అడుగు ముందుకు పడటం లేదు. ఆర్థిక భారం తగ్గించుకోవడంతోపాటు పర్యావరణానికి మేలు చేసే సోలార్​ ప్లాంట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్​ మినహాయిస్తే మిగతా చోట్లా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సోలార్​ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే ఆర్టీసీకీ ఏటా రూ.2 కోట్ల వరకూ ఆదా అవుతుంది.

బిల్లులు తగ్గించుకునేందుకు

ఆర్టీసీలో కరెంట్ బిల్లులను తగ్గించుకోవాలని, రాష్ట్రంలోని అన్ని డిపోల్లో సోలార్ విద్యుత్‌‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఆర్టీసీకి చాలా కమర్షియల్ స్పేస్‌‌, ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలనుకున్నారు. బస్ భవన్‌‌, జోనల్ శిక్షణ కేంద్రాలు, సిటీ నలుమూలలా ఉన్న బస్ స్టేషన్లలోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి ద్వారా ప్రతి డిపోకు 80 శాతం విద్యుత్ ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలనుకున్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రమంతటా సోలార్ విద్యుత్ అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ఏటా 2.2 కోట్ల ఆదా

మొత్తం 5 మెగావాట్ల సోలార్​ విద్యుత్‌‌ ఉత్పత్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి 2018 మేలో ఆర్టీసీ, రెడ్కో మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ ఎంవోయూ 25 ఏళ్లపాటు కొనసాగనుంది. సోలార్​ ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణకు కర్వి కన్సల్టేషన్స్‌‌, వార్ప్‌‌ కన్సల్టేషన్స్‌‌, సన్‌‌ కన్సల్లేషన్స్‌‌ టెండర్లు దక్కించుకున్నాయి. బస్‌‌ భవన్‌‌తోపాటు 97 డిపోలు, 3,576 బస్‌‌ స్టేషన్లు, మూడు వర్క్‌‌ షాప్‌‌లు, రెండు శిక్షణ కేంద్రాలు, తార్నాకలోని ఆస్పత్రిలో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మూడు విధాలుగా విద్యుత్‌‌ ధరను నిర్ణయించారు. ఒక కిలోవాట్‌‌ నుంచి 10 కిలో వాట్ల వరకూ వాడితే యూనిట్‌‌కు రూ.5.80, 11 కిలోవాట్ల నుంచి 100 కిలో వాట్ల వరకు ఉపయోగిస్తే రూ. 5.50, 100 కిలో వాట్లు దాటితే యూనిట్‌‌కు రూ.4.80 వరకు చార్జ్​ చేస్తారు. మూడింటినీ సగటున తీసుకుంటే యూనిట్‌‌కు రూ.5.50 అవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీ యూనిట్‌‌ విద్యుత్‌‌కు రూ.10పైనే చెల్లిస్తోంది. సోలార్​ విద్యుత్​ అందుబాటులోకి వస్తే ఏటా రూ.2.2 కోట్ల వరకు సంస్థకు ఆదా కానుంది.

త్వరగా పనులు పూర్తి చేయాలి

ఆర్టీసీలో సోలార్‌‌ ప్లాంట్ల ఏర్పాటు మంచి నిర్ణయం. గతేడాదే ఒప్పందం కుదుర్చుకు న్నా.. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. గ్రేటర్‌‌ పరిధిలోని 2, 3 డిపోల్లోనే సోలార్​ పవర్​ అందుబాటులోకి వచ్చింది. మిగతా డిపోల్లో పనులు పూర్తి చేస్తే.. ఆర్టీసీకి డబ్బుల ఆదాతోపాటు పర్యావరణానికి ప్రయోజనం. – హనుమంతు ముదిరాజ్‌‌, ప్రధాన కార్యదర్శి, టీజేఎంయూ