భటిండా మిలటరీ బేస్​లో సైనికులను తోటి జవానే కాల్చి చంపిండు

భటిండా మిలటరీ బేస్​లో సైనికులను తోటి జవానే కాల్చి చంపిండు

చండీగఢ్ : పంజాబ్ లోని భటిండాలో ఈ నెల 12న నలుగురు సైనికులను కాల్చి చంపిన కేసులో ఆర్మీ జవాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని దేశాయ్  మోహన్​గా గుర్తించారు. అసాల్ట్  రైఫిల్ ను దొంగిలించి కాల్పులు జరపడంతో నలుగురు సైనికులు చనిపోయారని పోలీసులు తెలిపారు. ముందుగా ఇద్దరు వ్యక్తులు ముసుగు వేసుకొని మిలటరీ బేస్ లోకి ప్రవేశించారని, వాళ్లే జవాన్లను చంపారని దేశాయ్  మొదట పేర్కొన్నాడు. అయితే, అనుమానితులు నలుగురితో పాటు దేశాయ్​ ను కూడా పంజాబ్​ పోలీసులు విచారించారు. దీంతో జవాన్లను చంపింది తానేనని దేశాయ్​ వెల్లడించాడు. అయితే, ఇది టెర్రర్  దాడి కాదని, వ్యక్తిగత గొడవే కారణం కావొచ్చని స్థానిక ఎస్పీ  గుల్ నీత్  సింగ్  ఖురానా సోమవారం మీడియాకు వెల్లడించారు. తనను సైనికులు మానసికంగా, శారీరకంగా వేధించినట్లు దేశాయ్  ఆరోపించాడని ఎస్పీ తెలిపారు.

ఆయుధాలు దొంగిలించి కాల్పులు జరిపాడు

దేశాయ్  ముందు నుంచి తమను తప్పుదారి పట్టించేందుకు యత్నించాడని ఎస్పీ గుల్ నీత్  ఖురానా చెప్పారు. ‘‘ముఖానికి ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఈ నెల 12న మిలటరీ బ్యారక్ లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని చెప్పాడు. ఒక ఆయుధం కనిపించకపోవడంతో దానిని ముసుగు వ్యక్తులు తీసుకెళ్ళారని దేశాయ్​ కథ అల్లాడు. దేశాయ్​ చెప్పే వివరాలపై తమకు మొదటి నుంచి సందేహాలు వ్యక్తమయ్యాయి. దేశాయ్​ను అదుపులోకి విచారించడంతో కాల్పులు జరిపింది తనేనని అంగీకరించాడు. ప్రస్తుతం అతడిని ఎంక్వయిరీ చేస్తున్నాం. అంతకుమించి వివరాలు వెల్లడించలేం” అని ఎస్పీ తెలిపారు.