కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించండి : యూటీఏసీటీఎస్​

కాంట్రాక్టు  అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించండి : యూటీఏసీటీఎస్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం (యూటీఏసీటీఎస్​) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారం టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందించారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ సర్కారు తమను పట్టించుకోలేదన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి.. యూనివర్సిటీ కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను గాలికొదిలేసిందని సీఎంకు వివరించారు. కాంగ్రెస్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సర్వీస్​ను క్రమబద్దీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సర్కారు యూనివర్సిటీలను నాశనం చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తుందని చెప్పారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ల సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉందని, త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని హామీనిచ్చారు.