కొల్లాపూర్, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమశిలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శనివారం సోమశిలలో పర్యటించి హెలిప్యాడ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 9న దీనిని ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్–సోమశిల, శ్రీశైలం– హైదరాబాద్ మార్గంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించడం ద్వారా పర్యాటకులకు ఆకాశ విహారంతో పాటు సంగమేశ్వర ఆలయం, శ్రీశైలం, నల్లమల అడవులను సందర్శించే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ఈ హెలి టూరిజం ద్వారా సుమారు 200 కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని, ప్రైవేట్ హెలికాప్టర్ల చార్జీలను పర్యాటకులే భరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అనంతరం కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 152 మంది విద్యార్థులకు రూ. 4,76,700 విలువైన స్కాలర్‌షిప్ చెక్కులు పంపిణీ చేశారు.
