సూర్య రియల్ హీరో..

సూర్య  రియల్ హీరో..

మొదట మాస్ క్యారెక్టర్లతో మనసులు దోచాడు. తర్వాత క్లాస్ పాత్రలతో కొత్తదనానికి తెర తీశాడు. విభిన్నమైన చిత్రాలతో నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. సమాజ సేవలో ముందుండి మంచి వ్యక్తిగానూ మన్ననలు అందుకుంటున్నాడు. అందుకే సూర్య అందరి అభిమానాన్నీ సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్ అయ్యుండి కూడా తన సింప్లిసిటీతో ఆకట్టుకునే ఈ స్టార్ హీరో ఇవాళే పుట్టాడు. ఈ సందర్భంగా సూర్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

చిన్నప్పటి నుంచే..
సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. 1975లో మద్రాస్‌లో పుట్టాడు. లయోలా కాలేజ్‌లో బీకామ్ చదివాడు. తండ్రి శివకుమార్‌‌ ఫేమస్ యాక్టర్ కావడంతో చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. అయితే నెపోటిజం ముద్ర తనపై పడకూడదనుకున్నాడు. అందుకే చదువు పూర్తయ్యాక కొన్నాళ్లపాటు ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పని చేశాడు. తనంత తానుగా బాస్ తెలుసుకునేవరకు శివకుమార్ కొడుకుననే విషయం ఆయనతో పాటు పని చేసే చోట ఏ ఒక్కరికీ చెప్పలేదట.

సూర్యకు పేరు పెట్టిన మణిరత్నం..
మణిరత్నం నిర్మించిన ‘నెరుక్కునేర్’ చిత్రంతో ఇండస్ట్రీలో  సూర్య అడుగు పెట్టాడు. అప్పటికే శరవణన్ అనే యాక్టర్ ఉండటంతో కన్‌ఫ్యూజన్ ఉండకూడదని తనకి సూర్య అనే స్క్రీన్ నేమ్  మణిరత్నం పెట్టారు. అయితే మొదటి సినిమా సూర్యకి నిరాశను మిగిల్చింది. బాల తీసిన ‘నందా’ మూవీతో బ్రేక్ వచ్చింది. తమిళనాడు స్టేట్ అవార్డ్ కూడా వరించింది. గౌతమ్ మీనన్ తీసిన ‘కాకక్కాక’ మూవీతో స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత శివపుత్రుడు, సుందరాంగుడు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి చిత్రాల్లోని డిఫరెంట్ క్యారెక్టర్స్తో  నటుడిగా మరిన్ని మెట్లు ఎక్కాడు. తన ప్రతి సినిమా తెలుగులోకి డబ్ అయ్యి ఆదరణ పొందింది. రజినీకాంత్ తర్వాత తెలుగులో అంత మార్కెట్ ఉన్న హీరో సూర్యనే అని సర్వేలు చెబుతున్నాయి. 

స్టార్ ప్రొడ్యూసర్గా..
నిర్మాతగానూ సక్సెస్‌ఫుల్‌గా సూర్య ముందుకు సాగుతున్నాడు. 36 వయసులో, 24, మగువలకు మాత్రమే, బంగారుతల్లి, జాక్‌పాట్, ఆకాశమే నీ హద్దురా, జై భీమ్, ఓ మై డాగ్ లాంటి మంచి చిత్రాల్ని నిర్మించాడు. రీసెంట్‌గా సాయిపల్లవి నటించిన ‘గార్గి’ చిత్రాన్ని తమిళంలో తనే రిలీజ్ చేశాడు. ప్రస్తుతం తన తమ్ముడితో ‘విరుమాన్’ చిత్రం తీస్తున్నాడు. ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ కూడా చేస్తున్నాడు. 2006లో నటి జ్యోతికను పెళ్లి చేసుకున్నాడు సూర్య. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న జ్యోతిక కొన్నాళ్లకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటించే సినిమాలను చాలావరకు తన బ్యానర్‌‌లోనే నిర్మిస్తున్నాడు సూర్య. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు.. దియా, దేవ్.

ఓటీటీలో విజయాలు..
సూర్య సినిమాలు ఓటీటీలో విడుదలై సంచలన విజయాలు సాధిస్తున్నాయి. అయితే నేరుగా ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చాడు. మణిరత్నం తీసిన నవరస అనే వెబ్‌ సిరీస్‌లో నటించాడు. చాలాకాలం క్రితమే టెలివిజన్‌ ఫీల్డ్ లోనూ అడుగు పెట్టాడు.  మీలో ఎవరు కోటీశ్వరుడు తమిళ షోకి హోస్ట్గా వ్యవహరించాడు. రెండు షార్ట్ ఫిల్మ్స్ లో  కూడా యాక్ట్ చేశాడు. వాటిలో ‘హీరోవా జీరోవా’ ఒకటి. దీన్ని సూర్యనే నిర్మించాడు. తనతో పాటు మాధవన్, జ్యోతిక, విజయ్ కూడా యాక్ట్ చేశారు. చైల్డ్ పావర్టీ, నిరక్షరాస్యత, బాల కార్మిక వ్యవస్థ వంటి వాటిపై తీసిన ఈ ఐదు నిమిషాల షార్ట్ ఫిల్మ్కి తమిళనాడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్పాన్సర్ చేసింది.  అవకాశం, అవసరం ఉన్నప్పుడల్లా తాను కనిపించకపోయినా తన స్వరాన్ని సూర్య వినిపిస్తుంటాడు.  గురు, ఘాజీ, పొన్ మగళ్ వందాల్ వంటి చిత్రాలకు తన వాయిస్‌తో సపోర్ట్ ఇచ్చాడు. అన్‌జాన్, పార్టీ, ఆకాశమే నీ హద్దురా లాంటి చిత్రాలకు పాటలు కూడా పాడాడు. ఒకట్రెండు మ్యూజిక్ వీడియోస్‌లో నటించాడు కూడా.

సేవా కార్యక్రమాలు..
సమాజ సేవలో సూర్య ఎప్పుడూ ముందుంటాడు.  ఎయిడ్స్పై  అవగాహనకు కృషి చేసే ట్యాంకర్ ఫౌండేషన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌‌గా ఉన్నాడు. అగరం ఫౌండేషన్‌ని స్థాపించి, దాని ద్వారా ఎంతోమంది పేద విద్యార్థుల్ని తన సొంత ఖర్చుతో చదివిస్తున్నాడు. సేవ్ ద టైగర్స్ క్యాంపెయినింగ్లో  పాల్గొంటున్నాడు. టీబీ పేషెంట్స్కు  సర్వీస్ చేసే రీచ్ అనే సంస్థతో కలిసి పని చేస్తున్నాడు. తన పుట్టినరోజును సేవా కార్యక్రమాలతోనే ప్లాన్ చేసుకుంటాడు తప్ప ఎలాంటి ప్రైవేట్ సెలెబ్రేషన్స్ ఇష్టపడడు. అంతేకాదు.. ఏ విపత్తు సంభవించినా తమ్ముడు కార్తితో కలిసి తక్షణ సహాయం అందిస్తాడు. బాల డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా కోసం కన్యాకుమారిలో మూడు ఇళ్లు కట్టారు. షూటింగ్ ముగిశాక వాటిని తీసేయబోతే వద్దని వారించిన సూర్య.. వాటిని అక్కడి జాలర్లకు ఫ్రీగా ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతగా ఎదుటివారి గురించి ఆలోచిస్తాడు. ఇక తండ్రి పేరు మీద ఉన్న శివకుమార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుటుంబమంతా కలిసి శ్రీలంకలోని తమిళ చిన్నారుల విద్యకు సహాయమందించారు. 

సమస్యలపై గళం...
 విద్యార్థులకు నష్టం కలిగించే ఏ సందర్భం ఎదురైనా తన వాయిస్ను సూర్య  గట్టిగా వినిపిస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ అనుసరిస్తున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సరిగ్గా లేదంటూ ధైర్యంగా కామెంట్స్ చేశాడు. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన నీట్ పరీక్షను రద్దు చేయమని కూడా డిమాండ్ చేశాడు. కోవిడ్ సమయంలో కోర్టులు సైతం వీడియో కాన్ఫరెన్సుల ద్వారా పని చేస్తుంటే, పిల్లల్ని మాత్రం ఫిజికల్‌గా వచ్చి పరీక్ష రాయమనడం ఏం న్యాయం అని ప్రశ్నించాడు. నీట్‌ని మనునీతితో పోల్చాడు. ఏకలవ్యుణ్ని ద్రోణాచార్యుడు బొటనవేలు ఇవ్వమన్నట్టుగా మన పిల్లల సామర్థ్యాన్ని ఏదో ఒక పరీక్షతో అంచనా వేయడం తప్పు అనేది సూర్య ఉద్దేశం. ప్రభుత్వ ప్రతినిధులు, నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినా సూర్య తన అభిప్రాయాన్ని చెప్పడంలో వెనక్కి తగ్గలేదు. అందుకే సూర్యని చాలామంది ఇష్టపడతారు.

ఉత్తమ నటుడిగానూ గుర్తింపు....

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జాతీయ అవార్డులను (National Awards) ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది కూడా 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది.  2020 సంవత్సరానికి ఉత్తమ హీరోగా సూర్య  నిలిచారు. ఆయన నటించిన తమిళ చిత్రం 'సూరయై పొట్రు' తెలుగులో ఆకాశం నీ హద్దురా' సినిమాకు ఈ అవార్డు వచ్చింది. నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘సూరరై పొట్రు’ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన అపర్ణ మురళి జాతీయ ఉత్తమ నటి అవార్డుని కైవసం చేసుకుంది.

ఓవైపు యాక్టర్గా నటనతో అలరిస్తుంటాడు. మరోవైపు వ్యక్తిగా సమాజం బాగు గురించి ఆరాటపడుతుంటాడు. సూర్య మాత్రమే ఇలా ఆలోచించగలడు.  అతను మాత్రమే ఇలా చేయగలడు అన్నట్టుగా నడచుకుంటాడు. అందుకే సూర్య అందరిలోకీ స్పెషల్. తను ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని.. తన సేవాగుణంతో మరెంతోమందికి జీవితం ఇవ్వాలని కోరుకుంటూ.. సూర్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు.