- కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ
- నకిలీ బిల్లులతో కోట్లు కొల్లగొట్టినట్టు గుర్తింపు
- పంపిణీలో అధికారుల కమీషన్ దందా మాజీ సీఈవో రాంచందర్,
- ఓఎస్డీ కల్యాణ్ కస్టడీ ముగియడంతో చంచల్‌గూడ జైలుకు తరలింపు
హైదరాబాద్, వెలుగు: గొర్రెల పంపిణీ స్కామ్ కీలక మలుపు తిరుగుతున్నది. రూ.700 కోట్ల గోల్‌మాల్‌పై ఏసీబీ అధికారులు కీలక సమాచారం సేకరించారు. గొర్రెల కొనుగోళ్లు, పంపిణీలో జరి గిన అక్రమాల చిట్టాను రాబట్టారు.ఈ మేరకు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈవో, గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ రాంచందర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
వీరిద్దరిని కోర్టు అనుమతితో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. కస్టడీ ముగియడంతో బుధవారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.అనంతరం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌కు తరలించారు. కస్టడీ రిపోర్టును సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందించారు. వీరిద్దరు వెల్లడించిన సమాచారం ఆధారంగా సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చి, వారిని విచారించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. రూ.700 కోట్ల గోల్‌మాల్ విషయంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా దళారుల నెట్‌వర్క్
గత ప్రభుత్వ హయాంలో గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ ఎండీగా రాంచందర్ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఓఎస్డీ కల్యాణ్‌కుమార్‌తో కలిసి గొర్రెల పంపిణీ స్కీమ్‌ను అమలు చేశారు. అయితే, గ్రామీణ ప్రాంతాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేసే సందర్భంలో స్థానిక వెటర్నటీ సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు.
ఈ క్రమంలోనే ఏపీ, బీదర్ సహా ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసేందుకు దళారులను ఎంపిక చేసుకున్నారు. కాంట్రాక్టర్లు మొయినొద్దీన్, అతడి కుమారుడు ఇక్రంతో గొర్రెలు కొనుగోలుకు డీల్ చేసుకున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్ల లో కొనుగోలు చేసిన గొర్రెలు తక్కువ కాగా.. లెక్కల్లో గొర్రెల సంఖ్యను అధికంగా రికార్డ్ చేశారు.