అధికారుల అండతో కాలనీ కబ్జా చేసేందుకు కుట్ర

అధికారుల అండతో కాలనీ కబ్జా చేసేందుకు కుట్ర

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ధరణి పోర్టల్​ను అడ్డంపెట్టుకొని కొంతమంది ఏడున్నర ఎకరాలు కొట్టేయడానికి ప్లాన్ చేశారు. అధికారుల అండతో కాలనీనే కబ్జా చేయాలని చూస్తున్నారు. విషయం బయటపడటంతో కాలనీ వాసులంతా ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ల దగ్గరకు పోయిండ్రు. 20 ఏండ్ల క్రితం తోట రామమ్మకు పెద్దపల్లి జిల్లా రంగాపూర్​లో ఏడున్నర ఎకరాల భూమి ఉండేది. ఆమెకు వారసులు లేకపోవడంతో భూమిని పేదలకు పంచడానికి నిర్ణయించుకుంది. అప్పటి ఎస్​ఐ భూమయ్య చొరవ చూపడంతో గ్రామానికి చెందిన 80  పేద కుటుంబాలకు దానం చేసింది. ఈ జాగాలో అందరూ ఇండ్లు కట్టుకున్నారు.

రామమ్ము  దానం చేయకముందు భూమిని అదే గ్రామానికి చెందిన శేఖర్, బాపు కౌలుకు సాగు చేసేవారు. రెండేండ్ల క్రితం రామమ్మ చనిపోయింది. ధరణి పోర్టల్​ఏర్పాటైన తర్వాత  248 సర్వే నంబర్ భూమిలో ఐదెకరాలు రామమ్మ పేరు మీదనే వచ్చింది. చనిపోయిన రామమ్మ పేరు మీద పట్టా ఎలా చేశారో తెలియదు. అప్పటికే ఏడున్నర ఎకరాల్లో రెండున్నర ఎకరాలు బాపు అనే వ్యక్తి పేరు మీదకు మారిపోయింది. మిగతా ఐదెకరాలు కూడా తమదే అంటూ శేఖర్, బాపు ధరణి పోర్టల్​లో పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతే కాకుండా తమను ఖాళీ చేయాల్సిందిగా వేధింపులకు గురిచేస్తున్నట్లు కాలనీ వాసులు చెప్తున్నారు.  

ఇప్పుడు కాదంటే ఎట్లా? 

రామమ్మ భూమిని పంచడంతో అప్పటి తహసీల్దార్​ సర్టిఫికెట్లు ఇవ్వగా, కొంతమంది పేదలు అప్పు చేసి పక్కా ఇండ్లు కట్టుకున్నారు. ఉన్నవారిలో 30 మందికి పైగా దళితులు ఇందిరమ్మ ఇండ్లకు అప్లయ్​ చేసుకోగా అప్పటి సర్కారు ఇండ్లు మంజూరు చేసింది. ఇప్పుడీ కాలనీలో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. వీరంతా గ్రామపంచాయతీకి ఇంటి పన్ను, కరెంటు బిల్లులు కడుతున్నారు. అయితే అకస్మాత్తుగా ఆ భూమి తమదేనంటూ శేఖర్, బాపు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తుండడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల కింద అడిషనల్​ కలెక్టర్​కు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు.  

ధరణితో అన్యాయం

ధరణి పోర్టల్ మూలంగానే అనేక చోట్ల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. దశాబ్దాలుగా నివాసముంటున్న ఇండ్లు, సాగు చేసుకుంటున్న భూములు సొంతదారులకు కాకుండా పోతున్నాయి. భూయజమానులు మారినా, చనిపోయినా ధరణిలో మాత్రం పాతవాళ్ల పేర్లే చూపిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్నవాళ్లంతా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ధరణి లేనప్పుడు గ్రామపంచాయతీ, మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కరించేవాళ్లు. పోర్టల్ వచ్చిన తర్వాత భూసమస్యల పరిష్కారం మొత్తం కలెక్టర్ల చేతుల్లోకే పోయింది. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారానికి మార్గం లేకుండా పోయింది.  

మా భూములకు పట్టాలియ్యలే

20 ఏండ్ల కింద అప్పటి తహసీల్దార్ మాకు సర్టిఫికెట్లు ఇచ్చిండు.  ఇప్పుడు ధరణిని అడ్డం పెట్టుకొని బాపు, శేఖర్ అనే వాళ్లు భూములను వాళ్ల పేర్ల మీద పట్టా చేయించుకున్నరు. దానమిచ్చిన భూమిలో పైసా పైసా కూడబెట్టుకొని ఇండ్లు కట్టుకున్నం. కొంత మందికి ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరైనయి. అధికారులు విచారణ జరిపి మాకు న్యాయం చేయాలె. 
- సిరిసిల్ల నర్సయ్య, బాధితుడు, రంగాపూర్

సంపినా ఇక్కడ నుంచి పోము

దానమిచ్చిన భూమిలో ఇండ్లు కట్టుకున్నం. కూలీ పనులు చేసుకొని బతుకుతున్నం. ఇప్పుడు ఈ భూములు మాయి కావంటే ఎవరికి చెప్పుకోవాలె. 20 ఏండ్ల సంది ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు కడుతున్నం. ఇప్పుడు ధరణిలో పేరు లేదంటున్నరు. మమ్మల్ని సంపినా ఇక్కడ నుంచి పోము.  
- తోట నాగమ్మ, రంగాపూర్