లిఫ్ట్ ఇస్తామని చెప్పి లూటీ చేశారు

లిఫ్ట్ ఇస్తామని చెప్పి లూటీ చేశారు

హైదరాబాద్ : కారులో లిఫ్టు ఇస్తామని చెప్పి ఓ వ్యక్తిని నిలువుదోపిడి చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. కారులో కూర్చోబెట్టుకొని అతనిపై దాడిచేసి, అతని దగ్గరున్న సెల్ ఫోన్, నగదు, బంగారు గొలుసును లాక్కున్నారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్  తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారానికి చెందిన టి. నవీన్ చారి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి  విజయవాడ నుంచి  మియాపూర్ చేరుకున్న నవీన్  1:30 గంటల సమయంలో బొల్లారం వేళ్లేందుకు మియాపూర్ బొల్లారం క్రాస్ రోడ్డు దగ్గర ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఆల్విన్ క్రాస్ రోడ్డు నుండి బొల్లారం వైపు వెళ్లే కారులో నలుగురు వ్యక్తులు నవీన్ కి లిఫ్టు ఇస్తామని చెప్పారు. ఆ మాటలు నమ్మిన నవీన్ కారు లోకి ఎక్కి, కొద్ది దూరం ముందుకు వెళ్లగానే ఆ నలుగురు వ్యక్తులు అతన్ని చితకబాది అతని వద్దనున్న సెల్‌ఫోన్ , రూ. 5వేల నగదు , రెండు తులాల బంగారు గొలుసు లాక్కున్నారు. నవీన్ వారి నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా బాచుపల్లి , హైదర్‌నగర్ రోడ్లలో తిప్పుతూ అతని దగ్గర ఉన్న సొమ్మంతా లాక్కొని చివరకు దుండిగల్ లోని కైసర్‌నగర్ కాలనీలో వదిలేసి పరారయ్యారు. జరిగిన విషయాన్ని బాధితుడు దుండిగల్ పోలీస్ స్టేషన్ లోని పోలీసులకు తెలుపగా.. వారు మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని సలహా ఇచ్చారు . దీంతో నవీన్ మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Some unidentified persons have robbed a man by offering him a lift in the car