ఓటేస్త..నాకేంటి? : డిమాండ్​ చేసి మరీ పైసలు

ఓటేస్త..నాకేంటి? : డిమాండ్​ చేసి మరీ పైసలు

డిమాండ్​ చేసి మరీ పైసలు తీసుకున్న కొందరు ఓటర్లు
సామాన్యుల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకూ ఇదే తీరు
లీడర్లపై నమ్మకం కోల్పోయిన జనం
ఇక ఐదేండ్లు దొరకరని ఇప్పుడే వసూలు చేసుకునే ఆలోచన
ఇంట్లోని ఓట్లన్నింటికీ కలిపి గంపగుత్తగా బేరాలు
అపార్ట్మెంట్లలోనూ ఇదే తరహా ఒప్పందాలు
సీసీ కెమెరాలు, జనరేటర్లు, జిమ్ సామగ్రి కూడా తీసుకున్నరు

మా ఇద్దరికి ఓట్లున్నాయి. ఓటుకు రూ.5 వేల చొప్పున ఇచ్చే ఒప్పందం కుదిరింది. ట్రావెలింగ్​ ఖర్చు కూడా క్యాండిడేట్​దే. అందుకే రెండు రోజులు సెలవు పెట్టినం’’ అంటూ హైదరాబాద్​లో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్​ ఇంజనీర్​ దంపతులు మంగళవారం రాత్రి మహబూబాబాద్​కు ప్రయాణమయ్యారు.

హైదరాబాద్, వెలుగు:రోజు కూలీలు రెండు పూటలా భోజనం దొరుకుతుందని, డబ్బులిస్తారని క్యాండిడేట్ల వెంట ర్యాలీలు, ఊరేగింపులు చేయడం కొత్తేమీ కాదు. కానీ బాగా చదువుకున్నోళ్లు, ఉద్యోగులు, సాఫ్ట్​వేర్​ ఇంజనీర్ల వంటివాళ్లు కూడా తమ ఓట్లకు బేరం పెట్టిన తీరు ఈసారి చాలాచోట్ల కనిపించింది. కుల సంఘాలు, యూత్ అసోసియేషన్లు, కమిటీలు, గ్రూపులన్నీ తమ వద్ద ఉన్న ఓటర్ల లెక్కలు చెప్పి డబ్బులు అడిగారు. ఎలక్షన్లు అయిపొయినంక లీడర్లు తమను పట్టించుకోరన్న భావన జనంలో పెరిగింది. ఐదేండ్ల దాకా లీడర్లు దొరకరని, అవసరమైనవి ఏమైనా ఇప్పుడే అడిగి చేయించుకోవాలన్న ఆలోచనకు వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనిచేసినా చేయకపోయినా ప్రతిసారి డబ్బులిచ్చి ఓట్లేయించుకోవచ్చన్న లీడర్ల తీరే ఓటర్లలో ఇట్లాంటి ట్రెండ్​కు కారణమైందని సామాజిక వేత్తలు చెప్తున్నారు.

గ్రేటర్​ హైదరాబాద్​ శివార్లలో ఎన్నికలు జరుగుతున్న నిజాంపేట కార్పొరేషన్​ పరిధిలో ‘జిమ్​ఎక్విప్​మెంట్​ఇవ్వండి, కాలనీలో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయండి’ అంటూ ఓటర్లు డిమాండ్​ చేసి తెప్పించుకున్నారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లోని ఓ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 60 వేలు ఇచ్చేలా ఓ పార్టీ క్యాండిడేట్​ నుంచి హామీ తీసుకున్నారు. ఇది తెలుసుకున్న మరో పార్టీ క్యాండిడేట్​ లక్ష రూపాయలు ఇస్తానని ముందుకొచ్చాడు. ఎల్బీనగర్ సెగ్మెంట్ పరిధిలో ఓటర్లు డిమాండ్​ చేయడంతో ఓ క్యాండిడేట్ వారి అపార్టుమెంట్​కు రంగులు వేయించేందుకు ఒప్పుకున్నాడు. కొన్ని అపార్ట్ మెంట్లలో రూ.3 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించేలా మాటిచ్చారు.

నల్గొండలో కొందరు క్యాండిడేట్లు పలు కాలనీలు, అపార్ట్ మెంట్లకు జనరేటర్లు ఇస్తామని ఒప్పుకుని బిల్లు కూడా అందజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఓ పార్టీ క్యాండిడేట్​ ఓటర్ కు రూ.500 ఆఫర్​ చేస్తే.. ఓటరు ఆ కాల్​రికార్డు వినిపించి, మరో అభ్యర్థి నుంచి రూ.వెయ్యి తీసుకున్నాడు. బెల్లంపల్లి, మంచిర్యాలలో ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఓ ఉద్యోగ సంఘం వాళ్లంతా గంపగుత్తగా ఓట్లేస్తామని డబ్బులు తీసుకున్నారు.

ఏకగ్రీవమైన చోట నారాజ్

అన్నిచోట్లా పంపకాల జోరు సాగుతుంటే ఏకగ్రీవ వార్డుల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. పోటీ ఉన్న చోట క్యాండిడేట్లు ఓటుకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తుండటంతో ఏకగ్రీవ వార్డుల్లో కొందరు ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల అయితే ఆందోళనకు కూడా దిగారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని ఓ వార్డులో క్యాండిడేట్లంతా చేతులు కలిపి అధికార పార్టీ క్యాండిడేట్​ను ఏకగ్రీవం చేశారు. దీనిపై గరమైన స్థానికులు కొందరు క్యాండిడేట్​ ఇంటికెళ్లి ఏకగ్రీవమెట్లా చేస్తరని నిలదీశారు. రోడ్డుపైనే ఆందోళన చేశారు. దీంతో సదరు లీడర్​ ఇంటికో 500 ఇస్తానని చెప్పి వాళ్లను శాంతింపజేశారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్‌గా వీసారపు ప్రగతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనికి తాము ఒప్పుకునేది లేదని, వార్డులో ఎలక్షన్లు నిర్వహించి తీరాలంటూ కొందరు ఓటర్లు ఆమె ఇంటి ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ 15వ వార్డు నుంచి ఆకుల రజిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో తాము ఓటేసే అవకాశం కోల్పోయామంటూ ఓటర్లు కొందరు నామినేషన్ ఉపసంహరించుకున్న క్యాండిడేట్​ ఇంటికెళ్లి నిరసన తెలిపారు. పటాన్​చెరు నియోజకవర్గం పరిధిలో ఒక క్యాండిడేట్​ ఓ కుల సంఘం వాళ్ల డిమాండ్​ మేరకు భవన నిర్మాణానికి తన స్థలాన్ని అగ్రిమెంట్​ చేయించారు.

అడిగి మరీడిజిటల్పంపకాలు

డబ్బుల పంపకాల చిక్కుల్లేకుండా.. గూగుల్​ పే, పేటీఎం. ఫోన్​పే, భీమ్​ యాప్​ల ద్వారా పలు చోట్ల ఓటర్లు డబ్బులు తీసుకున్నరు. ‘ఈ నెల మెయింటెనెన్స్​ బిల్లు మొత్తం మీరే చెల్లించండి’అంటూ గుండ్ల పోచంపల్లిలో ఒక అపార్టుమెంట్ ఓటర్లు డిమాండ్​ చేయటంతో క్యాండిడేట్లు పోటీపడి అక్కడి అపార్టుమెంట్​​వాళ్లకు డబ్బులు ముట్టజెప్పారు.

డబ్బులిచ్చేవారికి ఓటేయకండి

మున్సిపల్‌ ఎన్నికల్లో డబ్బులిచ్చి ప్రలోభ పెట్టేవారికి ఓటు వేయొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొందరు క్యాండిడేట్లు డబ్బు, ఇతర వస్తువులు ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోందని, వాటిని నియంత్రించడానికి కమిషన్‌ తరపున ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి రెండో వార్డులో డబ్బులు పంచుతున్న ఒక క్యాండిడేట్‌పై కేసు నమోదు చేయించి అరెస్టు చేశామన్నారు. ఇలా ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచినట్టుగా ఆధారాలు ఉంటే ఆ అభ్యర్థిపై డిస్‌ క్వాలిఫికేషన్‌ వేటు పడుతుందన్నారు. ఆలంపూర్‌ మున్సిపాల్టీలోనూ ఓట్లు కొనేందుకు ప్రయత్నించినట్టుగా ఫిర్యాదు అందిందన్నారు. సెల్‌ఫోన్లు, కెమెరాలతో ఇప్పుడు ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, దానిని ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడే అభ్యర్థులపై వేటు పడేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్యాండిడేట్లతోపాటు రాజకీయ పార్టీలు ప్రయత్నించాలని కోరారు.

డబ్బు కావాలా? మంచి నాయకుడా?  

ఇతని పేరు అబ్దుల్ ​హుస్సేన్. నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో ఆటోడ్రైవర్. ఎన్నికల్లో చాలామంది క్యాండిడేట్లు డబ్బులు ఎర వేస్తూ గెలుస్తున్నారని, దీన్ని అడ్డుకోవడానికి ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. ఓటర్లకు అవేర్​నెస్​ కల్పించడానికి తన ఆటో వెనక ఇదిగో ఇట్ల ఓ ఫ్లెక్సీ కట్టాడు.

see also: ప్రేమ పెళ్లి.. అనుమానంతో హత్య: అనాథగా 3 నెలల పాప