హద్దు మీరుతుండ్రు.. మహిళా ప్రజాప్రతినిధులకు వేధింపులు

హద్దు మీరుతుండ్రు.. మహిళా ప్రజాప్రతినిధులకు వేధింపులు

హద్దు మీరుతుండ్రు

మహిళా ప్రజాప్రతినిధులకు వేధింపులు
నిందితుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు
మొన్న తాటికొండ రాజయ్యపై సర్పంచ్ ఆరోపణ
దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా శేజల్ ఆందోళన
తాజాగా హైదరాబాద్ లో ఎమ్మెల్యేపై కార్పొరేటర్ ఫిర్యాదు

బంగారు తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైంది. ప్రజాప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు లైంగిక వేధింపులు పెరిగిపోయాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే లైంగిక వేధింపులు ఎదుర్కొనే వారిలో ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ పరిధిలోని ఓ ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్ ను వేధింపులకు గురి చేయడం చర్చనీయాంశమైంది. ఆమెతో కలిసి కొంత కాలంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఆమె పర్సనల్ నంబర్ కు కాల్ చేసి ‘తిన్నవా.. అర్ధరాత్రి వరకు తినక పోతే ఆరోగ్యం ఏమవుతుంది..?’అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టాడు.

అంతటితో ఆగక ఆమెతో వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ అసభ్యంగా మాట్లాడటంతో ఆ కార్పొరేటర్ కంగుతిన్నారు. తన సెల్ ఫోన్లో ఎమ్మెల్యే సంభాషణను రికార్డు చేసిన కార్పొరేటర్ విషయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. విషయం బయటకి పొక్కనీయ్యకుండా చూడాలంటూ సదరు కార్పొరేటర్ ను గులాబీ పార్టీ అధిష్టానం కోరినట్టు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యపైనా గతంలో లైంగిక వేధింపులపై ఆరోపణలు వచ్చాయి.

ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య బహిరంగంగా మీడియా ముందు చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. గ్రామాభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యే రాజయ్య చెప్పినట్టు చేయాలని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన తాటికొండ రాజయ్య నేరుగా నవ్య ఇంటికి వెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన ఆరోపణలన్నీ నిజమేనంటూ నవ్య తన వాయిస్ తగ్గించలేదు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, కేటీఆర్ కు వివరిస్తానని చెప్పడం విశేషం. 

తనను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధిస్తున్నారని ఆరిజిన్ డెయిరీ సీఈవో బొడపాటి శేజల్ ఆరోపిస్తున్నారు. ఆయన లైంగికంగా వేధించారంటూ ఆందోళన చేపట్టారు. ఏకంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద, బీఆర్ఎస్ ఆఫీసు వద్ద, జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు దిగారు. జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తమను స్థానికంగా వ్యాపారం చేసుకోనివ్వడం లేదని, అర్ధరాత్రి పూట తన క్వార్టర్ కు పిలిచి నానా దుర్భాషలాడారని, విషయాన్ని ప్రశ్నిస్తే తనపై తప్పుడు కేసులు నమోదు చేయించారని శేజల్ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆమె ఢిల్లీలోనే ఉండి ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. 

గులాబీ అధినేత ఉదాసీనత

మహిళల రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పుకొంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. మహిళల కోసం షీ టీమ్ లను ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఆడబిడ్డల వైపు అసభ్యంగా చూసిన వారి గుడ్లు పీకేస్తామంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై బహిరంగంగా ఆందోళనలు జరిగినా బీఆర్ఎస్ పెద్దలు ఏమీ పట్టనట్టుగా వ్యవహరించడం గమనార్హం.