మిస్టరీ.. ఓ అడవిలో శవమైంది

మిస్టరీ.. ఓ అడవిలో శవమైంది

ఓ అమ్మాయి ఫ్రెండ్‌ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరింది. ఆరు వారాలైనా తిరిగి రాలేదు. అదే టైంలో ఒక పెంపుడు కుక్క అడవిలో నుంచి ఆమె చేతి ఎముకను నోట కరుచుకుని తీసుకొచ్చింది. ఆ ప్రాంతంలో వెతికితే కుళ్లిపోయిన ఆమె శవం కనిపించింది. ఇంతకీ ఆమె ఆ అడవిలోకి ఎందుకు వెళ్లింది? ఆమెను ఎవరు చంపారు? అది హత్యా? ఆత్మహత్యా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కానీ.. అవన్నీ ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే!

అమెరికాలోని న్యూజెర్సీలో యూనియన్ కౌంటీలో భాగంగా ఉంది స్ప్రింగ్‌‌ఫీల్డ్ టౌన్‌‌షిప్‌‌. దానికి ఆనుకుని ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలోకి 1972 సెప్టెంబరు19న ఒక కుక్క షికారుకు వెళ్లింది. ఓ గంట తర్వాత ఆ కుక్క నోట్లో ఒక ఎముక పట్టుకని బయటికి వచ్చింది. ఆ ఎముకకు కుళ్లిపోయిన మాంసం కొంత అతుక్కొని ఉంది. ఆ ఎముక పట్టుకుని ఆ కుక్క నేరుగా దాని యజమాని అపార్ట్​మెంట్‌‌కి వచ్చింది. లాన్‌‌లో దాంతో చాలాసేపు ఆడుకుంది. అందరూ దాన్ని చూసి ఏదో జంతువు ఎముక అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. దాని యజమానికి అనుమానం వచ్చి పరీక్షించారు. అప్పుడు అది ఒక మనిషి ముంజేతి ఎముక అని అర్థమైంది. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 

స్ప్రింగ్‌‌ఫీల్డ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాళ్లకు ఆ చేతి ఎముకను అప్పగించారు. దాని ఆధారంగా ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ కుక్క వెళ్లిన అడవిలోని కొండ ప్రాంతంలో వెతికితే ఒక ఆడపిల్ల శవం దొరికింది. అది పూర్తిగా కుళ్లిపోయింది. మరో చేతి వేళ్ల గోళ్లపై తెల్లటి నెయిల్ పాలిష్ ఉంది. శవం నిటారుగా ఉండి, ముఖం కింది వైపుకి ఉంది. చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ బెర్నార్డ్ ఎహ్రెన్‌‌బర్గ్‌‌ ను సంఘటనా స్థలానికి పిలిపించారు. కానీ.. శవం కుళ్లిపోవడంతో అతను ఆ శవం ఎవరిది అనేది తేల్చలేకపోయాడు. ఆ తర్వాత ఆమె పళ్లను పరిశీలించి ఆమె16 ఏండ్ల బాలిక, స్థానిక హైస్కూల్ విద్యార్థి జెన్నెట్ డిపాల్మా అని ధృవీకరించారు. ఆరు వారాల క్రితం ఆమె తప్పిపోయినట్లు పోలీసులకు కంప్లైంట్ అందింది. 

ఆధారాల్లేవు 

ఆ శవం జెన్నెట్​ది అని గుర్తించారు. కానీ.. కుళ్ళిపోయి ఉండడంతో శవ పరీక్ష చేయలేమని డాక్టర్లు చెప్పారు. దాంతో ఆ చావుకి కారణాన్ని గుర్తించలేకపోయారు. అందుకే దాన్ని ‘హత్య’ అని చెప్పడానికి ఆధారాలు లేకుండా పోయాయి. అస్థిపంజర పరీక్ష ప్రకారం, శరీరంపై బుల్లెట్ గాయాలు, పగుళ్లలాంటివేవీ గుర్తించలేదు. ఆమె ప్యాంటు, లోదుస్తులు, చొక్కా కూడా పరీక్షించారు. సంఘటన స్థలంలోని మట్టిని సేకరించి ఆధారాల కోసం వెతికారు. అక్కడ ఇతర ఆధారాలు దొరకలేదు. ఆమె లోదుస్తులుపై మరకలు, రక్తం, స్పెర్మ్‌‌ లాంటివి దొరికే అవకాశం ఉందని పరీక్షలు చేశారు. కానీ.. అవి కూడా దొరకలేదు.  

ఇంతకీ ఎవరామె?

చనిపోయిన జెన్నెట్‌‌అదే స్ప్రింగ్‌‌ఫీల్డ్ టౌన్‌‌షిప్‌‌లోని క్లియర్‌‌వ్యూ రోడ్‌‌లో ఉండేది.1972 ఆగస్టు 7 సోమవారం మధ్యాహ్నం జెన్నెట్ డిపాల్మా ఇంటి నుండి బయల్దేరింది.  ‘‘ఫ్రెండ్‌‌ ఇంటికి వెళుతున్నా.  సాయంత్రం తిరిగి వచ్చేస్తా” అని తల్లితో చెప్పింది. కానీ.. ఆమె రాత్రి అయినా ఇంటికి రాలేదు. దాంతో తల్లిదండ్రులు మరుసటి రోజు ఉదయమే పోలీసులకు కంప్లైంట్‌‌ చేశారు. అప్పటినుంచి  ఆమెని వెతుకుతున్నారు పోలీసులు. ఆరు వారాల తర్వాత ఆమె శవం దొరికింది. 

క్షుద్ర పూజలు 

జెన్నెట్ తల్లిదండ్రులు తమ కూతురికి ఏసుక్రీస్తు అంటే భక్తి ఎక్కువని చెప్పారు. ఆమె తనతో ఉండేవాళ్లను మంచి మార్గంలో నడిపించేందుకు, తప్పులు చేసేవాళ్లను మార్చడానికి ప్రయత్నించేది. డ్రగ్స్ కి అడిక్ట్‌‌ అయిన ఎంతోమందికి ఆమె సాయం చేసింది. చిన్న వయసులోనే అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. అయితే.. అప్పట్లో ఆ ప్రాంతంలో కొంతమంది దెయ్యాల ఆరాధన చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. 

కొంతమంది స్థానికులు అక్కడికి దగ్గర్లోనే ఒక పార్క్‌‌లో కొందరు సాతానుకు ప్రార్థనలు చేయడం, కోళ్లు, పావురాలు, అప్పుడప్పుడు మేకను బలి ఇవ్వడం చూశామని చెప్పారు. వాళ్లే జెన్నెట్‌‌ని చంపి ఉంటారని అక్కడివాళ్లు అనుకున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చేలా ఆమె శవానికి దగ్గర్లో కొన్ని వస్తువులు కూడా దొరికాయి. జెన్నెట్ శవానికి రెండు మైళ్ల కంటే తక్కువ దూరంలోనే చనిపోయిన జంతువులు, కాలిన కొవ్వొత్తులు, రక్తంతో ఉన్న గిన్నె, మెడలు విరిచి చంపిన పావురాలు, వాటి ఈకలు కనుగొన్నారు. కానీ.. స్ప్రింగ్‌‌ఫీల్డ్ పోలీస్ చీఫ్ జార్జ్ పార్సెల్ ఏం చెప్పాడంటే... ‘‘డిపార్ట్‌‌‌‌మెంట్ నుండి కొంతమంది మంత్రగత్తెలని అక్కడికి తీసుకువెళ్లాం. కానీ.. వాళ్లు ఆమె చావుకు క్షుద్ర పూజలతో సంబంధం లేకపోవచ్చని” చెప్పారన్నాడు.

శిలువలు ఎందుకు? 

జెన్నెట్‌‌ శవం చుట్టూ శవ పేటిక ఆకారంలో చెక్కలు ఉన్నాయని, శవం చుట్టూ చిన్న చిన్న కర్రలతో చేసిన తాత్కాలిక శిలువలు ఉన్నాయని కొందరు చెప్పారు. వాటి ఆధారంగా.. పాస్టర్ రెవరెండ్ జేమ్స్ టేట్ జెన్నెట్‌‌ని సాతాను వాదులు బంధించి చంపేశారని చెప్పాడు. అంతేకాదు.. ఆమె గతంలో దెయ్యాల్ని ఆరాధించే వాళ్లను మంచి మార్గంలోకి రమ్మని చెప్పే ప్రయత్నం చేసింది. వాళ్లని మంచిగా మార్చే ప్రయత్నం చేసింది అని ఆయన చెప్పారు. అందుకే వాళ్లు ఆమెను చంపేశారని అనుమానం వ్యక్తం చేశాడు.  

మంత్రె గత్తెలు ఉండేవాళ్లు

ఆ కాలపు వార్తా కథనాల ప్రకారం... ఈ ప్రాంతంలో మంత్రగత్తెలు ఉన్నారు. అక్టోబరు 31, 1972న ఒక అసోసియేటెడ్ ప్రెస్ ప్రచురించిన కథనంలో  లిలిత్ సింక్లైర్ అనే మహిళ 30 మంది సాతానువాదుల టీంకు నాయకత్వం వహించింది. వాళ్లు శాన్ ఫ్రాన్సిస్కోలోని అంటోన్ ఎస్‌‌. లావీ  స్థాపించిన చర్చ్ ఆఫ్ సాతాన్ శాఖలో ఉండేవాళ్లు. జెన్నెట్‌‌ చావుకు వీళ్లు కూడా ఒక కారణం కావొచ్చనే వాదనలు వినిపించాయి. 

మంత్రాలు కారణం కాదు

వైర్డ్‌‌ఎన్‌‌జే.కామ్‌‌ సంపాదకులు పొలాక్, మైక్ మోరన్ ఈ కేసును కొన్నేండ్ల క్రితం దర్యాప్తు చేశారు. కానీ.. గతంలో వచ్చిన వరదల టైంలో ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్‌‌, సాక్ష్యాలు మిస్సయ్యాయని స్థానిక పోలీసులు చెప్పారు. దాంతో.. సమాచార స్వేచ్ఛా చట్టం ద్వారా మళ్లీ 2019లో వాటిని తెప్పించుకున్నారు. ఆ ఫైల్స్‌‌లో ఉన్న క్రైమ్ సీన్ ఫొటోగ్రాఫ్‌‌లతో పాటు జెన్నెట్ కేసు ఫైల్‌‌ని పరిశీలించారు. చివరగా వాళ్లు చెప్పిందేంటంటే.. జెన్నెట్ మరణానికి కారణమైన క్షుద్ర కార్యకలాపాలేవీ అక్కడ జరగలేదు. ఆ ఫొటోల్లో శిలువలు లేవు. అంతేకాదు... ఆమె అక్కడికి  ఎలా వెళ్లిందనే దాని మీద కూడా ఒక థియరీ చెప్పారు. 

జెన్నెట్ ఆ ప్రదేశానికి తన ఫ్రెండ్స్‌‌తో కలిసి వెళ్లి ఉండొచ్చు. అక్కడ పార్టీ చేసుకునే టైంలో ప్రమాదవశాత్తు ఆమె చనిపోయి ఉండొచ్చు. దాంతో ఆమె ఫ్రెండ్స్‌‌ అక్కడి నుంచి పారిపోయారు. ఇలా ఎందుకు చెప్పారంటే.. ఆమె శవం దొరికిన కొండమీదికి ఎక్కడం చాలా కష్టం. పైగా ఈ శవాన్ని ఎత్తుకుని వెళ్లడం మరీ కష్టం. కాబట్టి చంపినవాళ్లు ఆమె శవాన్ని అంత ఎత్తయిన కొండమీద పారేయాలి అనుకోరు. ఆమె కాళ్లకు హైకింగ్‌‌ షూ ఉన్నాయి. శవానికి ఎనిమిది అడుగుల దూరంలో ఒక విక్స్ ఇన్‌‌హేలర్, మార్కల్ టిష్యూస్ ప్యాక్, లిప్‌‌స్టిక్, దువ్వెన, ఒక కీ, చిన్న ఐషాడో ప్యాలెట్ ఉన్నాయి. ఆమెది హత్య అయితే.. చంపేవాళ్లు అవన్నీ అక్కడికి ఎందుకు తీసుకొస్తారు? అనేది పొలాక్, మైక్ మోరన్ లేవనెత్తిన ప్రశ్న. 

సీరియల్‌‌ కిల్లర్ చంపాడా? 

జెన్నెట్‌‌ని సీరియల్ కిల్లర్ చంపి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.1970వ దశకంలో రిచర్డ్ కాటింగ్‌‌హామ్ అనే సీరియల్‌‌ కిల్లర్‌‌‌‌ యువతులు, మహిళలను చంపేవాడు. అతను న్యూయార్క్‌‌లోని బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్‌‌కు కంప్యూటర్ ఆపరేటర్‌‌గా పనిచేశాడు. అయినా.. న్యూజెర్సీలోనే ఉండేవాడు. కాటింగ్‌‌హామ్ తాను పట్టుబడక ముందు 85 నుంచి 100 మందిని చంపినట్లు చెప్పాడు. బాధితులను హింసించి, అత్యాచారం చేసి, క్రూరంగా చంపిన తర్వాత వాళ్ల శవాలను అడవుల్లో పారేసేవాడు. 

అతనే జెన్నెట్‌‌ హైకింగ్ చేస్తున్నప్పుడు కిడ్నాప్‌‌ చేసి చంపి ఉండవచ్చని కొందరు అంటున్నారు. డ్రగ్ ఓవర్ డోస్, ఆత్మహత్య వల్ల కూడా ఆమె చనిపోయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు  రీసెర్చర్లు . దాంతో పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేశారు. కానీ.. ఆ అనుమానాలు నిరాధారమైనవని తేల్చారు. ఎందుకంటే అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. దాంతో ఈ కేసుని ఇప్పటికీ ‘అనుమానాస్పద మరణం’గానే చెప్తున్నారు.