- ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి
- జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఘటన
కోరుట్ల, వెలుగు : తనకు పెండ్లి చేయట్లేదన్న కోపంతో ఓ యువకుడు తండ్రిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ తండ్రి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని దుబ్బవాడకు చెందిన ఎల్ల గంగనర్సయ్య (74)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అన్వేశ్ ఉన్నారు. హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన అన్వేశ్ ఆరేండ్లుగా ఇంటివద్దే ఖాళీగా ఉంటున్నాడు.
తనకు పెండ్లి చేయాలని తరచూ తండ్రితో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన అన్వేశ్ కర్రతో తండ్రిపై దాడి చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డ గంగ నర్సయ్యను మెట్‌పల్లిలోని హాస్పిటల్‌కు అక్కడి నుంచి నిజామాబాద్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ గంగనర్సయ్య సోమవారం చనిపోయాడు. మృతుడి చిన్న కుమార్తె హారిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్, ఎస్సై కిరణ్ తెలిపారు.
