కొడుకు, కూతురు, అల్లుడు కలిసి చంపేశారు

కొడుకు, కూతురు, అల్లుడు కలిసి చంపేశారు
  •     తాగి వచ్చి తిడుతున్నాడని దారుణం
  •     ఏడాదిన్నర తర్వాత హత్య కేసును ఛేదించిన పోలీసులు

మెదక్​ (చేగుంట), వెలుగు : హత్య కేసు మిస్టరీని ఏడాదిన్నర తర్వాత పోలీసులు ఛేదించారు. మెదక్  జిల్లా చేగుంట మండలం అనంత సాగర్ కు చెందిన కావేటి కిష్టయ్య (65) ది సహజ మరణం కాదని అతని కొడుకు, కూతురు, అల్లుడు కలిసి పథకం ప్రకారం చంపేశారని ఎస్పీ బాలస్వామి తెలిపారు. కేసు వివరాలను ఆయన మంగళవారం మీడియాకు వెల్లడించారు. అనంత సాగర్​ గ్రామానికి చెందిన కిష్టయ్య, లచ్చవ్వ దంపతులకు  కొడుకు స్వామి, ఇద్దరు కూతుర్లు రేణుక, సత్తవ్వ ఉన్నారు. పెద్ద కూతురు రేణుకను 16 ఏళ్ల కింద వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్​కు చెందిన అశోక్​తో పెళ్లి చేశారు.

 కాగా అశోక్​ ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్లడంతో అప్పటి నుంచి రేణుక అనంతసాగర్​లోని తల్లి గారింట్లోనే ఉంటోంది. అశోక్​ 2022లో పెరోల్​పై  బయటకు వచ్చాడు. కాగా కిష్టయ్య మద్యం తాగి వచ్చి కొడుకు స్వామి, పెద్ద కూతురు రేణుక, అల్లుడు అశోక్​ను తిట్టేవాడు. దీంతో ఎప్పుడూ తమను తిడుతున్నాడన్న కోపంతో  కిష్టయ్యను చంపాలని వారు ప్లాన్  చేశారు. అంతేగాక ఆయన పేరు మీద ఉన్న భూమిని  రిజిస్టర్​ చేసుకోవచ్చని చెప్పగా చెల్లెలు, బావ అందుకు సరే అన్నారు. అదును కోసం ఎదురు చూశారు.

తల్లి లచ్చవ్వ 2022 జులై 16న శెట్​పల్లిలోని చిన్న కూతురు సత్తవ్వ వద్దకు వెళ్లగా అదే అదనుగా భావించి కొడుకు స్వామి.. అశోక్​ ను ఇంటికి పిలిచాడు. ఆరోజు రాత్రి కిష్టయ్యను చంపాలని స్వామి, అశోక్, రేణుక ప్లాన్​ వేసుకున్నారు. రాత్రి కిష్టయ్య అన్నం తిని సోఫాలో పడుకోగా 11 గంటల సమయంలో  అశోక్​, రేణుక కలిసి కిష్టయ్య కాళ్లు పట్టుకోగా, స్వామి గొంతు పిసికాడు. ముఖం మీద దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. కిష్టయ్యది సహజ మరణంగా లచ్చవ్వను, బంధువులను, గ్రామస్థులను నమ్మించి అంత్యక్రియలు చేశారు.

కాగా, తన భర్త మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ లచ్చవ్వ ఇటీవలే చేగుంట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్  మేజిస్ట్రేట్​ అనుమతితో సికింద్రాబాద్  గాంధీ ఆసుపత్రి నుంచి ఫోరెన్సిక్​ డాక్టర్​ టీంను అనంతసాగర్​కు  రప్పించి సోమవారం సమాధి తవ్వి శవపరీక్ష చేశారు. వైద్య బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా స్వామి, అశోక్, రేణుకను మంగళవారం అదుపులోకి తీసుకుని  విచారించగా కిష్టయ్యను  తామే చంపేసి సహజ మరణంగా చిత్రీకరించామని ఒప్పుకున్నారు. ఆ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.