
తండ్రి కారు కిందపడి కొడుకు మృతిచెందని విషాద ఘటన ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. జహీరాబాద్‌కు చెందిన అంగిర్ల లక్ష్మణ్, రాణి దంపతులు సిటీకి వచ్చి మన్సూరాబాద్‌లోని కాస్మోపాలిటన్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా చేరారు. వీరికి కుమార్తె భవాని(4), కొడుకు సాత్విక్( ఏడాదిన్నర) ఉన్నారు. ఆదివారం ఉదయం10 గంటల సమయంలో లక్ష్మణ్ అపార్ట్మెంట్లోకి కారును రివర్స్ తీస్తుండగా.. అక్కడే ఆడుకుంటున్న అతని కొడుకు సాత్విక్ కారు వద్దకు పరిగెత్తుకొచ్చాడు. అది గమనించకుండా.. లక్ష్మణ్ కారును అలాగే వెళ్లనీయడంతో.. సాత్విక్ మీదుగా కారు వెళ్లింది. దాంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సాత్విక్‌ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు ఫైల్ చేశామని ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు.