
- తల్లిని చంపి ఆత్మహత్య చేసుకున్న కొడుకు
- భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఘటన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తనకేమైనా అయితే తల్లిని ఎవరు చూసుకుంటారంటూ కొంతకాలంగా బంధువులకు చెబుతున్న ఓ యువకుడు చివరకు తల్లిని రాడ్‌తో కొట్టి చంపేశాడు. తర్వాత తానూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం వెలుగుచూసింది. పట్టణంలోని బూడిదగడ్డకు ఎందిన తుల్జా కుమారి పాసి (58) భర్త కొన్నేండ్ల కింద చనిపోగా కొడుకు వినయ్‌కుమార్ (8), కూతురు ఉంది. తల్లీకొడుకులు ఒకే ఇంట్లో ఉంటుండగా పెండ్లి అయిన కూతురు పక్క ఇంట్లో ఉంటోంది. తుల్జాకుమారితోపాటు, వినయ్‌కుమార్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఈ క్రమంలోనే తనకేమైనా అయితే అమ్మను ఎవరు చూసుకుంటారంటూ బంధువుల వద్ద వాపోయేవాడు. ఇదే కారణంతో శుక్రవారం రాత్రి వినయ్ తల్లి తుల్జాకుమారిని రాడ్‌తో కొట్టి చంపేశాడు. తర్వాత ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం వీరి ఇంటి తలుపులు తీయకపోవడంతో పక్కింట్లో ఉంటున్న తుల్జాకుమారి కూతురు డోర్ కొట్టింది. అయినా తలుపులు తీయకపోవడంతో గట్టిగా నెట్టడంతో ఓపెన్ అయ్యాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా వినయ్ ఉరి వేసుకొని, తుల్జాకుమారి రక్తపు మడుగులో కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ రహమాన్, సీఐ కె.శివప్రసాద్, ఎస్సై పురుషోత్తం ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.