ఎన్నికల ప్రచారంలో పాటల ట్రెండ్..!

ఎన్నికల ప్రచారంలో పాటల ట్రెండ్..!
  • ఎన్నికల ప్రచారంలో పాటల ట్రెండ్..!
  • సొంతంగా సాంగ్స్ రాయించుకుంటున్న అభ్యర్థులు
  • స్కీములు, పథకాలపై బీఆర్ఎస్ పాటలు 
  • మిగతా పార్టీలదీ ఇదే దారి
  • హిట్ సాంగ్స్ కు వెంటనే పేరడీలు

ఖమ్మం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాటలు మారుమోగుతున్నాయి. అన్ని పార్టీలు తమ క్యాంపెయిన్ లో పాటలను తప్పనిసరి చేశాయి. పార్టీలే కాకుండా, అభ్యర్థులు కూడా సొంతంగా పాటలు రాయించుకుంటున్నారు. తమ పేర్లు, పార్టీ గుర్తు, చేసిన పనులను గుర్తు చేస్తూ లిరిక్స్ రాయిస్తున్నారు. వాటిని మ్యూజిక్​ డైరెక్టర్ల ఆధ్వర్యంలో రికార్డు చేయించి ప్రచార రథాల్లో తిప్పుతున్నారు. కొన్ని పాటలు క్యాచీగా ఉంటుండడంతో సినిమా పాటల స్థాయిలో హిట్ అవుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాలో ప్రచారం పాటలు కూడా ట్రెండింగ్ గా మారుతున్నాయి. దీంతో వెంటనే ఆ పాటలకు పేరడీలు, కౌంటర్ సాంగ్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ ప్రచార పాటల పోటీతో కొత్త కవులు, రచయితలకు, సింగర్స్ కు కూడా అవకాశాలు దొరుకుతున్నాయి. 

ఉద్యమం నుంచి పాటలదే కీలకపాత్ర

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ప్రజల్లో స్ఫూర్తి నింపడంలో పాటలు కీలక పాత్ర పోషించాయి. మలిదశ ఉద్యమంలో గద్దర్​ పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా.. పోరు తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా’ పాట రాష్ట్రమంతా మారుమోగింది. ‘జయ జయహే తెలంగాణ, జననీ జయకేతనం’ పాటతో పాటు వందల సంఖ్యలో పాటలు ఉద్యమానికి ఊపిరిపోశాయి. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి రాజకీయ పార్టీలకు పా టలు రాయించడం మొదలైంది. ‘కదిలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా.. త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా’ అంటూ అప్పట్లో వచ్చిన పాట ప్రతి నోటిలోనూ నానింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ విస్తృతంగా పాటల వినియోగం పెరిగింది. 2018 ఎన్నికల్లో మహాకూటమికి వ్యతిరేకంగా ‘తెలంగాణ నేలమీద వేద్దాము ఒట్టు, కారు గుర్తుకేద్దాం ఓటు.. వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే, వీడెవ్వడో వచ్చి కుట్రలు చేస్తే’ అంటూ వచ్చిన పాట అప్పటి ప్రజల్లో టీడీపీకి వ్యతిరేకంగా సెంటిమెంట్ ను రగిలించింది. ప్రతి ఎన్నికల సభలో ఈ పాటను టీఆర్ఎస్ బాగా ప్రమోట్ చేసింది. దీంతో అప్పటి టీఆర్ఎస్ కు భారీ మెజార్టీ వచ్చేందుకు పాట దోహదపడింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అదే పనిలో ఉంది. పార్టీ కారు గుర్తును జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఉద్యమ సమయంలో కేసీఆర్ పాత్రను గుర్తు చేసేలా రెండు ప్రత్యేక పాటలను బీఆర్ఎస్ సిద్ధం చేసింది. 

బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాల్లో పాటల పాత్ర..!

ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలతో పాటు, ఆ పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లో ‘గులాబీల జెండలే రామక్క.. గుర్తుల గుర్తుంచుకో రామక్క’ పాట విపరీతంగా మోతమోగుతోంది. కేసీఆర్ సభ ప్రారంభానికి ముందు కళాకారులు ఇదే పాటకు డ్యాన్సులు వేయడంతో పాటు, స్టేజీపై నుంచి ప్రసంగాలకు ముందు కూడా ఈ పాటను ఎక్కువగా ప్లే చేయాలని పార్టీ ముఖ్య నేతల నుంచి సూచనలు కూడా ఉన్నాయి. రామక్క పాటతో పాటు ‘ఉక్కు గుండెను ఒక్కసారన్నా తాకాలనున్నదే.. ఆ బక్కపలచని పెయ్యిని హత్తుకోవాలనున్నదే’ పాటను బీఆర్ఎస్ సభల్లో తప్పనిసరిగా రిపీటెడ్ గా వాడాలని ఆ పార్టీ ఆదేశంగా లీడర్లు చెబుతున్నారు. బహిరంగ సభ ముగిసి కేసీఆర్ తిరిగి వెళ్లే సమయంలో ‘ఉక్కు గుండె... ’ పాటను ప్లే చేయడం ద్వారా ఆ లిరిక్స్ లోని ఉద్యమ ఘట్టాలను ప్రజలకు గుర్తు చేయొచ్చన్నది బీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ రిలీజ్ చేసిన ‘గులాబీల జెండలే రామక్క’ పాట హిట్ కావడంతో, అదే పాటకు పదుల సంఖ్యలో పేరడీలు కూడా వచ్చాయి. ‘కల్వకుంట్ల దొంగలే రామక్క’, ‘చేతిగుర్తు జెండాలమ్మ రామక్క’ ఇలా చాలా పాటలను కాంగ్రెస్ పార్టీ తమ పాటలుగా ప్రచారంలోకి తెచ్చింది. ఇక ప్రచార సభల్లో పాటలు పాడేందుకు ప్రత్యేకంగా బీఆర్ఎస్ కొందరు సింగర్స్, కళాకారులను ఉపయోగించుకుంటోంది. గతంలో సింగర్ సాయిచంద్ ను పూర్తిగా బీఆర్ఎస్ సభల కోసం ఉపయోగించుకోగా, ఆయన చనిపోయిన తర్వాత సింగర్లు ఏపూరి సోమన్న, మధుప్రియ, సింగర్, రైటర్ మానుకోట ప్రసాద్ తో పాటు మరికొందరు ఈ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సభల్లో పాటలు పాడుతున్నారు. 

అభ్యర్థులకూ సొంత పాటలు..!

పార్టీల పాటలు ఒకవైపు ట్రెండింగ్ లో ఉంటే, మరోవైపు అభ్యర్థులు కూడా పాటలు రాయించుకుంటున్నారు. ఒక్కో అభ్యర్థి కనీసం రెండు పాటలను రాయించుకొని, వాటిని ఎన్నికల ప్రచార రథాల్లో విపరీతంగా వాడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలు తాము ఆయా నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి పనులను, ప్రభుత్వ స్కీములను గుర్తు చేస్తూ ప్రత్యేక పాటలను సిద్ధం చేయించుకున్నారు. కొత్తగా ఎలక్షన్ బరిలో ఉంటున్న నాయకులు కూడా తమ ఆలోచనలను పాటల రూపంలో ప్రజల ముందు పెడుతున్నారు. తాము అంతకు ముందు చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చెబుతున్నారు. దాదాపు 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రత్యేక పాటలను ఎలక్షన్ల కోసం సిద్ధం చేసుకోవడంతో ఆయా పాటల రచయితలకు కూడా చేతి నిండా పనిదొరికింది. రెగ్యులర్ గా సినిమా పాటలు రాసే వారికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాల్సి వస్తుండడంతో, ఇలాంటి ఎన్నికల రిలేటెడ్ పాటలను పెద్దగా కమర్షియల్ పాటలు రాయని రైటర్స్ తోనే రాయిస్తున్నారు. దీని వల్ల లిమిటెడ్ బడ్జెట్ లో పాట కంప్లీట్ చేయించుకోవడం నాయకుల ఆలోచనగా ఉంది. కొద్దిగా గుర్తింపు ఉన్న సింగర్స్ తో వాటిని రికార్డింగ్ చేయిస్తుండడంతో మొత్తం రూ.లక్ష, లక్షన్నర ఖర్చులో పాట సిద్ధమవుతోందని లీడర్లు చెబుతున్నారు. 

30కి పైగా పాటలు రాసినా..

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం పాటలు రాయాలని ఆఫర్లు వస్తున్నయ్​. ఇప్పటి వరకు 30కి పైగా పాటలు రాసిన. కొందరు మంత్రులతో పాటు ఎమ్మెల్యేల ఎలక్షన్ ప్రచారానికి ఉపయోగపడేలా పాటలు రాసిన. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యత, మహబూబ్ నగర్ ప్రగతిపదం, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, బీఆర్ఎస్ సోషల్ మీడియాకు కంటెంట్ అందించిన. రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి కూడా రచనలు చేసిన. ఎలక్షన్ ప్రచార పాటలతో కళాకారులకు, కవులకు కూడా ఉపాధి దొరుకుతోంది. 

-  అభి ఉప్పుల, కవి, పాటల రచయిత