
తెలకపల్లి రవి రచించిన ‘ప్రజాగానం’ సామాజిక ఉద్యమ గీతాలు అనే సంపుటి ప్రజలను ఉత్తేజపరిచి, మార్పును ప్రేరేపించే రీతిలో కవిత్వాన్ని అందించింది. ఇది సమకాలీన సామాజిక, రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తూ, సమాజంలో చైతన్యాన్ని నింపుతుంది. నాటి నుంచి నేటి వరకు ఉన్న అధికార దోపిడీ వ్యవస్థను ప్రశ్నిస్తూ, సామ్యవాద సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ సంకలనంలోని గీతాలు సాగుతాయి. అటు ఉద్యమకారులకు, ఇటు సామాన్య ప్రజలకు స్ఫూర్తినిస్తూ వారిలో నవచైతన్యాన్ని నింపేలా ఈ పాటలు ఉంటాయి. అంతేకాదు ఆనాటి సామాజిక, రాజకీయ స్థితిగతులను, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఇవి రూపుదిద్దుకున్నాయి.
కళ అనేది కళ కోసం కాదు, కాసుల కోసం కాదు, ప్రజల కోసం చాటమంటూ.. ‘ప్రజాగానం’ గీతంలో కళలు ప్రజల జీవితాల్ని ప్రతిబింబించే రూపాలుగా వర్ణించారు. విప్లవాన్ని బతికించేందుకు, పీడిత ప్రజలపై దాడులను వ్యతిరేకిస్తూ చావుకి ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఎందరో విప్లవవీరులను స్మరిస్తూ ‘కనుమూసిన వీరుల్లారా..’ అంటూ పాడతారు. ‘ప్రపంచ కార్మిక దినోత్సవం’లో మేడే సందర్భాన్ని, దినోత్సవ గొప్పతనాన్ని ఈ గీతంలో చెప్తారు. కమ్యూనిస్టుల ఐక్యత కోసం పుట్టిన సీపీఎం.. దాని చరిత్ర, నిర్మించుకున్న ఆశయాల కోసం చేసిన కృషి, కర్తవ్యాలను మరో గీతం వివరిస్తోంది. ‘ఎర్రజెండా వచ్చిందో’ అనే గీతం.. రెక్కలు ముక్కలై, కాయ కష్టం చేసుకునేవారి హక్కుల కోసం పోరును నేర్పింది.
‘కొండల్లోన బుట్టినోళ్లం’ అనే మరో గీతం.. కొండ, కోనల్లో పుట్టి పెరిగినా, క్రూర మృగాల మధ్యన బతికినా ఏనాడూ భయం కలగలేదు. కానీ, తప్పుడు పాలనలో మేమున్న చోటికి వచ్చి మా అస్తిత్వాన్ని తన్నుకుపోతున్న ఈ పాలకులను చూస్తే భయం కలుగుతోంది అంటూ వారికి వ్యతిరేకంగా ఏర్పాటైన ఎర్రజెండా ప్రాముఖ్యత ఇందులో ఉంది. ‘పోరాటం చేద్దామా’లో.. పోరాడకపోతే బతుకు లేదు, మనిషి లేడు. చదువు, కొలువు, భద్రత, భవిష్యత్తు, స్వతంత్రం ఏమీలేవు.
ఇలా ఆధిపత్యం, ఆంక్షలపై ఇకనైనా పోరాటం చేద్దామా అంటూ పాటగా గొంతెత్తారు. ‘డబ్బు రాజకీయం’లో రాజకీయాల తీరుపై విమర్శతో కూడిన గీతం చేశారు. ‘వేమన’ రూపకంలో.. వేమన పద్యాల తీరు, అందించిన చైతన్యగీతికను విశదీకరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంకలనంలో 50కి పైగా గీతాలున్నాయి. ఈ పుస్తకంలో రచయితకు సామాజిక మార్పు పట్ల ఉన్న నిబద్ధత, ప్రజల కోసం అంకితమైన ఉద్దేశం ఆయన కవిత్వ లక్షణంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యమాలకు, పాటలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని, ఒక సమూహాన్ని సమీకరించడంలో పాటలు పోషించే కీలక పాత్రను ఈ పుస్తకంలో చక్కగా విశ్లేషించారు కూడా.
-పి. రాజ్యలక్ష్మి