పాటల సాహిత్య దారుల్లోకి... పాటలు రాసేవారికి మెళుకవలు

పాటల సాహిత్య దారుల్లోకి... పాటలు రాసేవారికి మెళుకవలు

సాహిత్య ప్రక్రియలైన కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శల్లో పాటదే మొదటి స్థానం. మిగిలిన ప్రక్రియలు కొందరికే అర్థం అవుతాయి. పాట మాత్రం సామాన్యులను కూడా కదిలిస్తుంది. మరి అలాంటి పాటను రాయాలనుకునే కొత్త యువరచయితల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగిపోతున్నది. అలాంటి వారికి, అలాగే పాట రాయాలనుకునే ఔత్సాహికులకు కొన్ని మెళకువలు నేర్పడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం!

పాటలో ఉండే ప్రధాన ఉపాంగాలు పల్లవి, చరణాలు. ముందుగా పాట సారాంశాన్ని తెలియజేసే పల్లవి పాటకు ఇంజన్ లాంటిది. ఆ తరువాత పాటలో ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక్కో విషయాన్ని విడమరిచి వర్ణించేది చరణాల్లోనే. ఒక పోలికతో చెప్పాలనుకుంటే పాటను ఒక రైలు అనుకుంటే పల్లవి ఇంజనైతే, చరణాలు రైలు బోగీల వంటివి. ఈ రకమైన నిర్మాణానికి సాకీ, అనుపల్లవి అనే మరో రెండు ఉప ఉపాంగాలు కొన్ని సందర్భాల్లో జతవుతాయి.

 ఆర్ధ్రత కలిగిన పాటలకు సాకీ అవసరమవుతుంది. ఈ సాకీ వల్ల శ్రోతలు ఆసక్తిని కనబరుస్తారు. నిశ్శబ్దంలోకి జారుకుని పాటపైన దృష్టి నిలుపుతారు. కావున సాకీతో కూడుకున్న పాటలను పరిశీలిస్తే ఈ అవగాహన కోసం మరింత స్పష్టత లభిస్తుంది. అలాగే అనుపల్లవి విషయానికొస్తే...పల్లవిలోనే చెప్పాల్సిన విషయం పూర్తికాకపోతే...అవసరం అయ్యేదే అనుపల్లవి. ఇదీ స్థూలంగా పాట స్వరూప స్వభావం.

పాటను ఎలా మొదలు పెట్టాలి?

పాటను రాయడంలో రెండు రకాలైన పద్ధతులు వాడుకలో ఉన్నాయి. అందులో ఎక్కువమంది అనుసరించేది...ఒకటి ముందుగానే ఒక బాణీని ఎంపిక చేసుకుని, అందులో పాటను రాయడం. అంటే ఒక జానపద పాట బాణీని స్వీకరించి అందులో మనం అనుకునే పాటను రాయడం. ఇందుకోసం రచయితకు తాను ఎంపిక చేసుకున్న అంశానికి, తాను ఎంపిక చేసుకున్న బాణీ సరిపోతుందో లేదో ఆలోచించుకోవాలి.

 ఎందుకంటే రచయిత ఎంపిక చేసుకున్న అంశం విషాదమైన అంశమైతే, దానికి ఊపుతో కూడుకున్న ఉర్రూతలూగించే బాణీ సూట్ కాదు. అందుకని పాట రాయాలనుకుంటున్న అంశం తాలూకు స్పష్టత రచయితకు ఉండాలి. అలాంటి సబ్జెక్ట్​తో గతంలో ఏమైనా పాటలు వచ్చాయా అనేది చూసుకోవాలి. అలాగని గతంలో రచయితలు రాసిన సాహిత్యాన్ని స్వీకరిస్తే కాపీ రచయితలు అయ్యి చెడ్డపేరు వస్తుంది. 

అందుకని అవగాహన కోసం మాత్రమే ఆయా పాటల్ని వినాలి. వాటి ప్రభావం రచయిత మీద లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోను ఒక రచయిత రాసిన పాటలోని వాక్యాలను, తాము కొత్తగా రాస్తున్న పాటల్లోకి రాకుండా చూసుకోవాలి. ఈ రకమైన జాగ్రత్త లేకపోతే తమ ముందటి కవుల పోలికలు, ప్రతీకలు, కవితాత్మక ప్రయోగాలు వీరి పాటల్లోకి  కూడా తమకు తెలియకుండానే వచ్చి చేరుతాయి. ఈ రకమైన వర్ణనలు కొన్ని సార్లు కొత్తగా రాసే రచయితలకు, అవి తమవి కావు, తమకంటే ముందే వేరే రచయితలు చెప్పి ఉన్నారనే స్పృహ ఉండకపోవచ్చు కూడా. అందుకని రచయితలు పాట రాసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోను ఈ రకమైన ఆకర్షణకు, మాయకు గురికాకుండా చూసుకోవాలి.

పాటంటే పదాలను బాణీలో కూర్చడం కాదు...!!

చాలా మందికి పాటంటే బాణీలో పదాలను కూర్చడమే అనే దురభిప్రాయం ఉంది. అది కరెక్ట్ కాదు. కొత్త బాణీలో కొత్త సాహిత్య సృజన చేసి వింటున్నవాళ్ల మనసును కదిలించేదే పాట. అందుకోసం కొత్తగా రాసే రచయిత బాణీ దొరకడంతో అందులో ఎలాంటి కవితాత్మకత లేకుండా రాసుకుంటూ పోతే పాట పూర్తవుతుందేమోగాని, అది జనాన్ని మెప్పించలేదు. ఎందుకంటే ఎంపిక చేసుకున్న అంశాన్ని కవితాత్మకంగా వర్ణించి చెప్పగలిగే సృజనాత్మక ప్రతిభ రచయితకు ఉండాలి. అట్లా చెప్పలేకపోతే అది సాధారణ పాటగా మాత్రమే మిగిలిపోతుంది. అందుకని రచయిత ఎంపిక చేసుకున్న అంశం ఏ రసాన్ని పలికించాలో అందుకు సంబంధించిన పదాలు తెలుసుకోవాలి. వాటిని కవితాత్మకంగా ప్రయోగించాలి. 

ప్రకృతి పోలికలతో చెప్పడం వల్ల ఏ భావమైన, వింటున్న వారి గుండెను తాకుతుంది. అందువల్ల పాట రాసేటపుడు...పాటలోని ప్రతీ వాక్యం కవితాత్మకంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అది జనం గుండెల్లో నాటుకుపోతుంది. అందుకు మంచి పాటలు విని, వాటిలో రచయిత చేసిన ప్రయోగాలను గుర్తుపట్టి ఆస్వాదించగలగాలి. అట్లా ఆ పాటలతో మమేకం అయ్యి, వాటిని ఇష్టపడితే అలాంటి పాట రాయాలనే ఆకాంక్ష క్రమంగా కొత్త రచయితలకు కూడా కలుగుతుంది. భావానికి తగ్గ బాణీ, బాణీకి తగిన కవితాత్మక వర్ణన పాటను నిలబెడుతుంది. ఇంకా కొత్త పాట పుట్టాలంటే, ఇప్పటి దాకా ఎవ్వరూ చెప్పని విషయాలు హృద్యంగా, కొత్తగా చెప్పే శక్తి ఉంటే అది సాధ్యమవుతుంది. 

సాధన ముఖ్యం !!

పాట రాసే రచయితకు ఓపిక ఉండాలి. అందులోకి పరకాయ ప్రవేశం చేయాలి. ముఖ్యంగా కీర్తి, పేరాశ, డబ్బు ఆశతో ఉంటే తొందర పెరిగిపోతుంది. ఎట్లా రాసినా జనం ఆదరిస్తారనే తేలిక భావం వచ్చి చేరుతుంది. అట్లా కాకుండా రాసిన దానిని సాహిత్యం తెలిసినవారికి వినిపించి, చూపించి రాసిన పాటను ఎడిట్ చేసుకునే అలవాటు ఉండాలి. అట్లా ఈ దిద్దుకోవడంలో పాట మరింత పదునెక్కుతుంది. తప్పు ఒప్పులు విజ్ఞులైన పెద్దల వల్ల తెలిసి వస్తాయి. 

ముఖ్యంగా పాటకోసం రోజులో కొంత సమయం కేటాయించాలి. ప్రతీరోజు ఒక గంటో, రెండుగంటలో పాట రాసే సాధన చేయాలి. అట్లా రాయగా రాయగా...సాధనలో మరిన్ని మెళకువలు తెలిసి వస్తాయి. అందుకోసం పాటే ప్రపంచంగా జీవించాలి. పేరుమోసిన పండితులనైనా, చదువురాని నిరక్షరాస్యులనైనా అలరించి, ఆలోచింపజేసే పాటకున్న శక్తి అద్భుతమైంది.  అది గుర్తించిన రచయిత పాట రాసేటపుడు దానినొక సామాజిక బాధ్యతగా భావిస్తాడు.

 తనకంటే ముందు రాసిన రచయితల పాటలను జాగ్రత్తగా పరిశీలించాలి. వారు పదాలను వాడిన తీరును అర్థం చేసుకోవాలి. కవిత్వాన్ని ఎంతగొప్పగా పలికించారో గుర్తించాలి. పాట ఆయా కాలాల్లో, ఉద్యమాల్లో పోషించిన పాత్రను గురించి తెలుసుకోవాలి. అట్లా గొప్ప పాటలను ఇష్టపడి పదే పదే వినడం వల్ల, కొత్తగా రాసే రచయితలకు అవే దారిచూపిస్తాయి. పాట ఎలా రాయాలో నేర్పిస్తాయి. 

బాణీ లేకుండా పాట రాయొచ్చా?

బాణీలేకుండా పాట రాసే ప్రయోగాలు ఎక్కువగా సినిమా పాటల్లో జరుగుతుంటాయి. అందుకు కారణం అక్కడ చేయి తిరిగిన సినీ సంగీత దర్శకులు ఉంటారు. దేనికైనా వారు బాణీ కట్టి పాట చేయగలరు. మన సమాజంలో ఎక్కువమంది రచయితలు పాటలు పాడగలిగే వాళ్లే. పాడడం రాని రచయితలకు ఎవరో ఒకరు పూనుకుని, పనిగట్టుకుని బాణీ కడితే తప్పా అది పాటై కూర్చోదు. 

ఇలా బాణీ లేకుండా రాసే రచయితలకు ఇబ్బందులు ఎక్కువ. ఎందుకంటే పాటగా కుదరాలంటే వారు మాత్రా ఛందస్సులో రాయాల్సి ఉంటుంది. అంటే చరణంలో ఒక లైన్​లో ఎన్ని పదాలు వచ్చాయో, కింది లైన్​లో కూడా అన్నే పదాలు రావాలి. వాటిలో భావం ఉండాలి. అవి కవితాత్మకంగా ఉండాలి. అలా అక్షరాల సంఖ్య నియమంతో రాసే పాటకు సరిపోయే బాణీ కట్టడం వల్ల అది పాటవుతుంది. కాకుంటే బాణీ లేకుండా రాసే పాటలకంటే ఏదో ఒక పాపులర్ కాకుండా ఉన్న జానపద బాణీ తీసుకుని పాటరాయడం సులభంగా ఉంటుంది. 

- డా.పసునూరి రవీందర్,కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత, 77026 48825–