కాంగ్రెస్ పార్టీకి నేనే ఫుల్ టైం అధ్యక్షురాలిని

కాంగ్రెస్ పార్టీకి నేనే ఫుల్ టైం అధ్యక్షురాలిని

కాంగ్రెస్ పార్టీకి తానే ఫుల్ టైం అధ్యక్షురాలినని సీడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ అన్నారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలోని 23 మంది అసమ్మతి నేతలపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత సమస్యలపై మీడియాకెక్కొద్దని హెచ్చరించారు. ఏ సమస్య అయినా పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ ఉంటేనే పార్టీ మనుగడ సాధ్యమని సోనియా అన్నారు. రాబోయే ఎన్నికల్లో నాయకులందరూ కలిసి పనిచేయాలని సోనియా సూచించారు. అందరూ అనుకున్నట్లు తాను తాత్కాలిక అధ్యక్షురాలు కాదని, పూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని ఆమె అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలుచేసిందని సోనియా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా గత కొన్ని నెలల నుంచి డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని.. దానివల్ల సామాన్యుడిపై భారం పడుతుందని సోనియా అన్నారు. జమ్మూకాశ్మీర్లో పరిస్థితులు చక్కదిద్దాలని కేంద్రానికి సీడబ్ల్యూసీ సూచించింది. కొత్త వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని సీడబ్ల్యూసీ డిమాండ్ చేసింది. లఖింపూర్ ఘటనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది.

సోనియాగాంధీ అధ్యక్షతన రెండు గంటల నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. 50 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు హాజరుయ్యారు. రెండు సంవత్సరాల తర్వాత సీడబ్ల్యుసీ సమావేశం ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత.. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికీ రాజీనామా చేశారు. దాంతో అప్పటి నుంచి ఆమె అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.