తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ బై పోల్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే కూతురు ప్రియాంక గాంధీ కోసం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ రంగంలోకి దిగనున్నారు. వయనాడ్‌లో ప్రియాంక తరుఫున సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నుట్లు కేరళ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ALSO READ | బాధితులకు బిగ్ రిలీఫ్: బుల్డోజర్ కూల్చివేతలపై హై కోర్టు స్టే
చాలా ఏళ్ల తర్వాత సోనియా గాంధీ కేరళకు వస్తున్నారని.. 2024, అక్టోబర్ 22న వయనాడ్‌లో జరగనున్న రోడ్‌షోలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి ఆమె పాల్గొంటారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నేరుగా ప్రచార రంగంలోకి దిగుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొంది.
కాగా, ఈ ఏడాది (2024) జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలి రెండు స్థానాల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించిన రాహుల్.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ పార్లమెంట్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో 2024, అక్టోబర్ 15వ తేదీన వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ బై పోల్ ఎన్నిక జరగనుంది.
ఈ క్రమంలో తమ సిట్టింగ్ స్థానంతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ సీటు కావడంతో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని కాంగ్రెస్ ప్రియాంక గాంధీని బరిలోకి దించింది. ఇదిలా ఉంటే.. వయనాడ్‌లో కాషాయ జెండా రెపరెపలాడించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. ప్రియాంక గాంధీని ఢీకొట్టేందుకు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నవ్య హరిదాస్‌ను బరిలోకి దించింది. మరీ హై ప్రొఫైల్ స్థానమైనా వయనాడ్ ఉప ఎన్నికలో ఎవరూ గెలుస్తారో తెలియాలంటే నవంబర్ 23వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.