భూమి కోసం తండ్రిని గెంటేసిన కొడుకులు

భూమి కోసం తండ్రిని గెంటేసిన కొడుకులు
  • పోలీసులకు వృద్ధుడి ఫిర్యాదు

బెల్లంపల్లి​ రూరల్, వెలుగు: వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల సాగు భూమిని దక్కించుకున్న కొడుకులు మిగతా మూడు ఎకరాల భూమి కోసం కన్నతండ్రిని ఇంటి నుంచి గెంటేశారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆ వృద్ధుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కొత్తూర్​ గ్రామానికి చెందిన కటికల మల్లయ్యకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కూతురి పెండ్లి చేసి అత్తారింటికి సాగనంపారు. మల్లయ్య భార్య లింగమ్మతో కలిసి ఇంటి వద్దనే ఓ షెడ్​లో వేరుగా ఉంటున్నారు. ఆరు నెలల క్రితం అనారోగ్యంతో లింగమ్మ చనిపోయింది. అనంతరం పెద్దకొడుకు బీరయ్య, చిన్నకొడుకు రాజన్నలకు చెరో ఎకరం చొప్పున పట్టా చేసి ఇచ్చారు. మిగతా మూడు ఎకరాల మామిడితోట మల్లయ్య పేరు మీద ఉంది. చిన్న కొడుకు ఇంటికి ఆనుకొని చిన్న షెడ్​లో మల్లయ్య ఒంటరిగా ఉంటున్నాడు. అతని పేరున ఉన్న మూడు ఎకరాల మామిడితోటను పంచాలని పెద్ద కొడుకు కొంతకాలం నుంచి వేధిస్తున్నట్లు మల్లయ్య పేర్కొన్నారు. తమ్ముడి దగ్గరకు వెళ్లిన అన్న, వదిన తండ్రిని గెంటేయాలని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. కోపోద్రిక్తుడైన చిన్నకొడుకు తండ్రి సామాగ్రి బయట పారేశాడు. దీంతో మల్లయ్య పోలీస్​స్టేషన్​కు వెళ్లి కొడుకులపై ఫిర్యాదు చేశాడు. అధికారులు స్పందించి తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.