కాలమే అన్నింటినీ నిర్ణయిస్తుంది.. ఐటీ దాడులపై సోనూ సూద్ రియాక్షన్

కాలమే అన్నింటినీ నిర్ణయిస్తుంది.. ఐటీ దాడులపై సోనూ సూద్ రియాక్షన్

ముంబై: కరోనా టైమ్‌లో వలస కార్మికులను ఆదుకోవడం ద్వారా రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ ఆస్తులపై రీసెంట్‌గా ఐటీ దాడులు జరిగాయి. ముంబై, లక్నో, కాన్పూర్, జైపూర్‌తోపాటు ఢిల్లీ, గుర్గావ్‌లోని సోనూ ఆస్తుల మీద ఇన్‌కమ్ ట్యాక్స్ సర్వే చేసింది. విదేశీ విరాళాల విషయంలో చట్టాలను ఉల్లంఘించారని, రూ.20 కోట్లు పన్ను ఎగవేశారని సోనూపై ఐటీ శాఖ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఈ విషయంపై ఆయన స్పందించారు. కాలమే అన్నింటినీ నిర్ణయిస్తుందని సోనూ చెప్పారు. 

‘మనం ప్రతిసారి మన వాదనలను వినిపించాల్సిన అవసరం లేదు. అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది. భారతదేశ ప్రజలకు నా శక్తిసామర్థ్యాల మేర సేవ చేయాలని కంకణం కట్టుకున్నా. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి కూడా ఆపద, అవసరంలో ఉన్న వారి జీవితాలను కాపాడటానికి ఎదురు చూస్తూ ఉంటుంది. నేను అడ్వర్టయిజ్‌మెంట్లలో నటించడం ద్వారా నాకు రావాల్సిన ఫీజును మానవతా కార్యక్రమాలకు డొనేట్ చేసేలా బ్రాండ్ సంస్థలను ప్రోత్సహించా’ అని సోనూ సూద్ ట్వీట్ చేశారు. మంచి చేసే వారికి ఎల్లప్పుడూ మంచే జరుగుతుందని పేర్కొన్నారు.