చిన్నారి ట్రీట్​మెంట్​కు రూ.7లక్షలు ఇచ్చిన సోనూ సూద్

చిన్నారి ట్రీట్​మెంట్​కు రూ.7లక్షలు ఇచ్చిన సోనూ సూద్
  • ఎంత ఖర్చయినా భరిస్తానని పేరెంట్స్ కు భరోసా
  • కరీంనగర్​లోని హాస్పిటల్​లో కోలుకుంటున్న బాబు
     

మంచిర్యాల, వెలుగు: కూలీలు, కార్మికులు, నిరుపేదలకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ అండగా నిలుస్తున్న ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. నెలలు నిండకముందే.. కేవలం 900 గ్రాముల బరువుతోనే, స్టమక్​ ఇన్ఫెక్షన్​తో పుట్టిన చిన్నారి ట్రీట్​మెంట్​కు రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇంకా ఎంత ఖర్చు అయినా భరిస్తానంటూ ఆ బాబు తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన పోతు మహేశ్, లక్ష్మీప్రియ దంపతులకు రెండు నెలల కిందట కొడుకు పుట్టాడు.  నెలలు నిండకముందే కరీంనగర్​లోని ఒక ప్రైవేట్​ హాస్పిటల్​లో సిజేరియన్ జరిగింది. బాబు 900 గ్రాముల బరువుతో జన్మించాడు. అవయవాలు ఎదగలేదని, స్టమక్​ ఇన్ఫెక్షన్​ వల్ల బిడ్డ బతకడం కష్టమని డాక్టర్లు తేల్చారు. పదిహేను రోజుల తర్వాత బాబును హైదరాబాద్​లోని రెయిన్​బో హాస్పిటల్​కు తరలించారు. అక్కడ నాలుగు వారాలకు కొంత కోలుకున్నాడు. అయితే బిల్లు రోజురోజుకు పెరుగుతూ రూ.7లక్షలు దాటింది. మహేశ్​చేతిలో పైసలు లేకపోవడంతో తెలిసినవారిని సాయం అడిగాడు.
కోలుకుంటున్న చిన్నారి..
కరీంనగర్​లోని ఒక వ్యక్తి బాబు పరిస్థితిని సోనూసూద్​ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన వెంటనే స్పందించి హాస్పిటల్​ బిల్లు కట్టారు. ఎంత ఖర్చయినా భరిస్తానని, బాబుకు మెరుగైన ట్రీట్​మెంట్​ చేయించాలని చెప్పారు. ప్రస్తుతం కరీంనగర్​లోని ప్రైవేట్​ హాస్పిటల్​లో బాబుకు ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. చిన్నారి మరో 300 గ్రాముల బరువు పెరిగాడు. ఇన్ఫెక్షన్​ తగ్గుతూ తల్లిపాలు తాగుతున్నాడు. ఇప్పటివరకు కరీంనగర్​, హైదరాబాద్​లో కలిపి రూ.13 లక్షలు ఖర్చయిందని మహేశ్​​ తెలిపాడు. తాను 14 ఏండ్లుగా కరీంనగర్​లో ఉంటూ మార్బుల్​ వర్క్​ చేస్తున్నానని చెప్పాడు. సోనూసూద్ ఇప్పటికే రెండుసార్లు తన ఫ్రెండ్​కు ఫోన్​ చేసి బాబు పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడని చెప్పారు.