
- కాడెద్దులు కొనిస్తానని ట్వీట్
చిత్తూరు: లాక్‌డౌన్‌లో ఇబ్బంది పడ్డ వలస కూలీలకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతో సాయం చేశారు. కష్టం అని ఎవరు నోరు తెరిచి అడిగిన తన వంతు సాయం చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా ఆయన సాయం అందించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా రైతుకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు. తండ్రి వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన కూతుళ్ల వీడియో చూసిన ఆయన దానిపై స్పందించారు. ఆ రైతుకు సాయం చేస్తానని ట్వీట్ చేశారు. మొదట వారికి రెండు ఎద్దులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఎద్దులు కాకుండా.. ట్రాక్టర్ ఇస్తానని మరో ట్వీట్ చేశారు. ఆడపిల్లలు ఇద్దరు చక్కగా చదువుకోవచ్చని ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే… చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన టమోటా రైతు తన పొలంలో దున్నడానికి ఎద్దులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అసలే ఖరీఫ్ సీజన్ కావడంతో … అటు పొలం పనులు మొదలు పెట్టలేక.. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడి పట్టుకుని నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే… వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వచ్చారు. ఇది ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్‌లో అప్ లోడ్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన సోనూసూద్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.