త్వరలో కరెంటు, ఆర్టీసీ చార్జీల పెంపు?

త్వరలో కరెంటు, ఆర్టీసీ చార్జీల పెంపు?
  • చ్చే కేబినెట్​కు ప్రపోజల్స్​ తీసుకురండి: సీఎం

హైదరాబాద్, వెలుగు: కరెంటు, ఆర్టీసీ చార్జీల పెంపు దిశగా రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తోంది. ఎంత పెంచాలనే దానిపై ప్రపోజల్స్​ను వచ్చే కేబినేట్ మీటింగ్​కు తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆఫీసర్లను ఆదేశించారు. అందులో చర్చించి చార్జీల పెంపుపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. ఆర్టీసీ పరిస్థితిపై మంగళవారం ప్రగతి భవన్​లో ఉన్నతస్థాయి రివ్యూ జరిగింది. సంక్షోభంలో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాలని రవాణా మంత్రి, ఆర్టీసీ చైర్మన్, ఎండీ, ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. డీజిల్, టైర్లు, ట్యూబులు, విడిభాగాల ధరలు పెరిగి ఆర్టీసీపై యేటా రూ.600 కోట్ల భారం పడుతోందన్నారు. కరోనా, లాక్ డౌన్ల వల్ల రూ.3000 కోట్ల ఆదాయం కోల్పోయామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎంకు చెప్పారు. కిందటేడు మార్చిలో అసెంబ్లీలోనే ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతామని ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ చార్జీల పెంపుపై ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే కేబినెట్​ మీటింగ్​లో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

కరెంట్​పై కరోనా ఎఫెక్ట్​
కరెంటు చార్జీలపై విద్యుత్ మంత్రి జగదీశ్​రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు .. సీఎం కేసీఆర్​తో చర్చించారు. కరోనా వల్ల విద్యుత్తు సంస్థలు నష్టపోయాయని సీఎంకు వివరించారు. ఆరేండ్లుగా చార్జీలను పెంచలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించడానికి చార్జీలు పెంచాలని కోరగా వచ్చే కేబినెట్​లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి తెలిపారు. రాబోయే కేబినెట్ సమావేశానికి  ప్రతిపాదనలతో రావాలని తీసుకురావాలని విద్యుత్ శాఖ మంత్రి, అధికారులను ఆదేశించారు.