అమ్మాయిల పెళ్లి వయస్సు పెంపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

అమ్మాయిల పెళ్లి వయస్సు పెంపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ : అమ్మాయిల వివాహ వయసు పెంపునకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి పెళ్లి వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో పురుషుల పెళ్లి వయసు 21 కాగా.. స్త్రీలకు 18ఏళ్లుగా ఉంది. దీన్ని మార్చాలంటూ చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీ ఏడాది క్రితం అమ్మాయిల వివాహ వయసు పెంపుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

జూన్ లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
18 ఏళ్లకే పెళ్లిళ్లు జరగడం వల్ల అమ్మాయిల కెరీర్ కు అవరోధం ఏర్పడుతోందని, చిన్నతనంలోనే గర్భం దాల్చడం వల్ల వారి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందన్న వాదనలు ఈ మధ్యకాలంలో బలంగా వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం నుంచి అమ్మాయిల్ని కాపాడాల్సిన అవసరం ఉందని భావించిన ప్రధాని మోడీ నీతి ఆయోగ్ నేతృత్వంలో జూన్ లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. జయ జైట్లీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిపుణుడు వీకే పాల్, ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమం, న్యాయ శాఖ ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

టాస్క్ ఫోర్స్ ప్రతిపాదనలకు ఓకే?
అమ్మాయి తొలిసారి గర్భం దాల్చే నాటికి ఆమెకు 21 ఏళ్లు ఉండాలని టాస్క్ ఫోర్స్ ప్రతిపాదించింది. 21 ఏళ్లకు పెళ్లి చేయడం వల్ల వారి కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా సానుకూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. ఈ ప్రతిపాదనలన్నింటిపై చర్చించిన అనంతరం కేంద్ర కేబినెట్ వివాహ వయసు 21 ఏళ్లకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు త్వరలోనే బాల్య వివాహాల నిరోధక చట్టం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, హిందూ వివాహ చట్టంలో మార్పులు చేయనున్నారు.