అమృత్​పాల్‌‌ కేసు ఎన్‌‌ఐఏకి?

అమృత్​పాల్‌‌ కేసు ఎన్‌‌ఐఏకి?

న్యూఢిల్లీ/చండీగఢ్ : ఖలిస్తానీ మద్దతుదారుడు, ‘వారిస్  పంజాబ్  దే’ చీఫ్​ అమృత్ పాల్  సింగ్ పై నమోదైన ఆయుధాల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అంతేకాకుండా అమృత్  ఏడుగురు అనుచరులపైనా నమోదైన ఆయుధాల కేసును కూడా ఎన్ఐఏకే అప్పగించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వారందరూ అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నట్లు పోలీసులు ఇదివరకే కేసు నమోదు చేశారు. ఈ కేసులో అమృత్ ను ఏ1గా చేర్చారు. అలాగే అతని నలుగురు అనుచరులపై నేషనల్  సెక్యూరిటీ యాక్ట్  (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా తేల్చేందుకు కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, అమృత్ పాల్  అరెస్టును ప్లాన్  చేసేందుకు ఈనెల 2న కేంద్ర హోం మంత్రి అమిత్  షాతో పంజాబ్  సీఎం భగ్ వంత్  సింగ్  మాన్  చర్చించారని అధికారిక వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే ఈనెల 19న ‘వారిస్  పంజాబ్  దే’ గ్రూప్ కు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నాయి.

మూడో రోజుకు వేట

పరారీలో ఉన్న అమృత్  పాల్  సింగ్  కోసం పంజాబ్  పోలీసులు ఆరంభించిన వేట సోమవారం మూడో రోజుకు చేరింది. అతని కోసం పోలీసులు పంజాబ్  రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా గాలిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా అతడిని పట్టుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో అమృత్  బంధువు హర్జిత్   సింగ్, డ్రైవర్  హర్ ప్రీత్  సింగ్  ఆదివారం రాత్రి మెహత్ పూర్  ఏరియాలో బులంద్ పూర్  గురుద్వారా వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ నెట్, మొబైల్  సర్వీసెస్ పై బ్యాన్ ను మంగళవారం మధ్యాహ్నం వరకు పొడిగించారు. కాగా, అమృత్​పాల్ ఉపయోగించిన మెర్సిడెజ్  బెంజ్  కారు రావెల్  సింగ్  అనే డ్రగ్  డీలర్ దని పోలీసులు తెలిపారు.