టీ20 ఫార్మాట్‌లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు షాక్. బౌలర్లతో పాటు టాపార్డర్ బ్యాటర్లు తేలిపోయిన వేళ సౌతాఫ్రికాతో గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 51 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. దాంతో ఐదు టీ20ల సిరీస్ 1–1తో సమమైంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (46 బాల్స్‌లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 90) ఖతర్నాక్ బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో తొలుత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 213/4 భారీ స్కోరు చేసింది. డొనోవన్ ఫెరీరా (30 నాటౌట్) కూడా రాణించాడు.
వరుణ్ చక్రవర్తి (2/29) తప్ప ఇండియా బౌలర్లంతా నిరాశపరిచారు. ఛేజింగ్‌లో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (34 బాల్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 62) పోరాడినా.. మిగతా వాళ్ల నుంచి సపోర్ట్ లేకపోవడంతో ఇండియా 19.1 ఓవర్లలో 162 రన్స్‌కే ఆలౌటైంది. బార్ట్‌మన్ (4/24) నాలుగు వికెట్లు పడగొట్టాడు. డికాక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ధర్మశాలలో ఆదివారం జరుగుతుంది.
క్వింటన్ ఫటాఫట్:
ఇటీవలే వన్డేల నుంచి రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న క్వింటన్ డికాక్ విజృంభించడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. ఫ్లాట్ వికెట్‌పై భారీ షాట్లతో చెలరేగిన అతను త్వరలో జరగబోయే ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. కానీ డికాక్ ధాటికి ఆతిథ్య బౌలర్లు తలవంచక తప్పలేదు.
తొలి పోరులో డికాక్‌ను ఔట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్ ఈసారి సఫారీ ఓపెనర్ దెబ్బకు విలవిలలాడాడు. అతని బౌలింగ్‌లో డికాక్ సిక్స్‌తో తన వేటను ప్రారంభించగా, ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్ (8) కూడా సిక్స్ కొట్టాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో హెండ్రిక్స్ ఔటైనా డికాక్ మాత్రం దూకుడు తగ్గించలేదు. తన ధాటికి పవర్ ప్లేలో సౌతాఫ్రికా 53/1తో నిలిచింది. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (29) మరో ఎండ్‌లో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ సపోర్ట్ ఇవ్వగా.. ఫీల్డింగ్ మారిన తర్వాత క్వింటన్ జోరు కొనసాగించాడు.ఈ క్రమంలో 26 బాల్స్‌లోనే ఫిఫ్టీ అందుకున్నాడు.
11వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్.. ఏడు వైడ్స్, ఓ సిక్స్ సహా 18 రన్స్ సమర్పించుకున్నాడు. చక్రవర్తి వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో గేరు మార్చే ప్రయత్నం చేసిన మార్‌క్రమ్ లాస్ట్ బాల్‌కు ఔటవడంతో రెండో వికెట్ 83 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. ఆ తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ (14) తో కలిసి దూకుడు కొనసాగించిన డికాక్.. సెంచరీ ముంగింట అనవసర సింగిల్ కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు.
17వ ఓవర్లో బ్రెవిస్‌ను పెవిలియన్ చేర్చిన అక్షర్ 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. కానీ, చివరి మూడు ఓవర్లలో డేవిడ్ మిల్లర్ (20 నాటౌట్), డొనోవన్ ఫెరీరా భారీ షాట్లతో విజృంభించారు. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్లో ఫెరీరా రెండు సిక్సర్లు కొట్టి స్కోరు 210 మార్కు దాటించాడు. చివరి 10 ఓవర్లలో ఇండియా బౌలర్లు ఏకంగా 123 రన్స్ ఇచ్చారు.
టాప్ ఢమాల్... తిలక్ ఒంటరి పోరాటం
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఇండియా తడబడింది. టాపార్డర్ మరోసారి నిరాశపరిచింది. ఇన్నింగ్స్ ఐదో బాల్‌కే శుభ్‌మన్ గిల్ (0)ను ఎంగిడి డకౌట్ చేయగా.. రెండు సిక్సర్లతో దూకుడు మీద కనిపించిన మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (17)ను యాన్సెన్ వెనక్కుపంపాడు. కెప్టెన్ సూర్యకుమార్ (5) మళ్లీ ఫ్లాపయ్యాడు. యాన్సెన్ వేసిన నాలుగో ఓవర్లో తను కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇవ్వడంతో 32/3తో ఇండియా కష్టాల్లో పడింది.
ఈ టైమ్‌లో జట్టు బాధ్యతను తిలక్ వర్మ తీసుకున్నాడు. అనూహ్యంగా వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ (21 ) వేగంగా ఆడలేకపోయాడు. కానీ, మరో ఎండ్‌లో తిలక్ తన మార్కు షాట్లతో అలరించాడు. స్పిన్నర్ డొనోవన్ బౌలింగ్‌లో సిక్స్‌తో వేగం పెంచే ప్రయత్నం చేసిన అక్షర్‌ను బార్ట్‌మన్ పెవిలియన్ చేర్చడంతో ఇండియా 67/4తో ఇబ్బందుల్లో పడింది.
ఈ దశలో హార్దిక్ పాండ్యా (20 )తోడుగా తిలక్ ఛేజింగ్ కొనసాగించాడు. సిపామ్లా, లిండే ఓవర్లలో సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. తొలుత ఇబ్బంది పడిన పాండ్యా.. లిండే బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో స్కోరు వంద దాటించాడు. ఎంగిడి బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో తిలక్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
కానీ, సిపామ్ల వేసిన 15వ ఓవర్లో బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి పాండ్యా ఔటవగా.. సాధించాల్సిన రన్‌రేట్ పెరగడంతో ఆతిథ్య జట్టు ఒత్తిడిలో పడింది. తిలక్ తోడుగా జితేశ్ శర్మ (27) కొన్ని షాట్లతో అలరించి వెనుదిరిగాడు. 19వ ఓవర్లో బార్ట్‌మన్.. శివం దూబే (1), అర్ష్‌దీప్ (4), వరుణ్ చక్రవర్తి (0)ని ఔట్ చేయగా... తర్వాతి ఓవర్లో తిలక్ వర్మ.. కెప్టెన్ మార్‌క్రమ్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇండియా ఆలౌటైంది. ఐదు రన్స్ తేడాతో హోమ్‌టీమ్ చివరి ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం.
సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా: 20 ఓవర్లలో 213/4 (డికాక్ 90, డొనోవాన్ 30*, వరుణ్ చక్రవర్తి 2/29)
ఇండియా: 19.1 ఓవర్లలో 162 ఆలౌట్ (తిలక్ 62, జితేశ్ శర్మ 27, బార్ట్‌మన్ 4/24).

